
మియామి: అమెరికాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులతో హరికేన్ మైకేల్ కేటగిరీ–2గా బలపడింది. దీంతో ఫ్లొరిడాకు భారీ వర్ష ముప్పు ఉంది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కేంద్రీకృతమైన మైకేల్.. ఫ్లొరిడా వైపు దూసుకొస్తోంది.
బుధవారం కల్లా ఫ్లొరిడా తీరాన్ని తాకే అవకాశాలున్నాయని నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. ఇది భయంకర తుపాను అని, దీని వల్ల నష్టం భారీగా వాటిల్లే ప్రమాదం ఉందని ఫ్లొరిడా గవర్నర్ రిక్ స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లొరిడా తీరాన్ని చేరే సరికి అది కేటగిరీ–3గా బలపడే అవకాశం ఉందని చెప్పారు. 10–20 సె.మీ వరకు వర్షపాతం నమోదవడంతో పాటు వరదల ముప్పు ఉందని వాతావరణ నిపుణులు అంచనావేశారు.