సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించి మూడు నెలల కాలం ముగియడంతో చాలా మంది ప్రజలు శారీకంగా, మానసికంగా కృంగి పోతున్నారు. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇచ్చినా కరోనా భయంతో ఒకరి కొకరు కలసుకోలేక సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. ఫలితంగా చాలా మంది, ముఖ్యంగా యువతీ యువకులు ఉద్వేగానికి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అమెరికాలో లాక్‌డౌన్ కారణంగా 13.6 శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిడి గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
వారిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. వారిలో మూడొంతుల మంది తీవ్ర మానసిక ఒత్తిడి, క్షోభకు గురవుతున్నారట. ఒంటరితనం వల్ల కార్డియో వాస్కులర్ గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉందట. ఈ పరిస్థితుల్లో అమెరికాతోపాటు మరికొన్ని దేశాల్లో ‘క్వారంటైన్ బబుల్’ అనే కొత్త దృక్పథం పుట్టుకొచ్చింది. బంధు మిత్రుల్లో అతి సన్నిహితులు, లేదా ఒకే తరహా అభిరుచి కలిగిన వారు ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడి ఉమ్మడిగా క్వారంటైన్‌ను పాటించడాన్నే ‘క్వారంటైన్ బబుల్’ అని పిలుస్తున్నారు. ఈ ప్రత్యేక గ్రూపుల వారే తరచు కలుసుకోవడం ద్వారా సామాజిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రూపులు వారు ఒకే చోట ఆవాసం ఉంటూ సామాజిక సంబంధాలను కొనసాగిస్తుండగా, కొన్ని గ్రూపుల సభ్యులు విడివిడిగా జీవిస్తూనే తరచు కలసుకుంటున్నారు. (చదవండి : కరోనా: వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం)
ఈ గ్రూపుల వారు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేయించుకొని లేదని నిర్ధారణ అయినవారు, లేదా తమకు కరోనా లేదని గాఢంగా విశ్వసిస్తున్న వారంతా ఓ గ్రూపుగా ఏర్పడుతున్నారు. వారంతా కూడా మాస్క్‌లు ధరించడం, రెండు అడుగుల భౌతిక దూరం పాటించడం చేస్తున్నారు. గ్రూపు లోపల, బయట ఈ నిబంధనలను కచ్చితంగా పాటించడం గ్రూపు నిబంధనావళి. బయటకు వెళ్లడం ద్వారా లేదా ఆఫీసులకు వెళ్లడం ద్వారా దురదృష్టవశాత్తు గ్రూపులో ఎవరికి కరోనా వచ్చినా, గ్రూపులోని సభ్యులందరు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి.
ఈ క్వారంటైన్ బబుల్ దృక్పథం ఏకాకితనాన్ని, మానసిన ఒత్తిడిని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్ సందర్భంగా ఎవరికి వారు జీవించినంత సురక్షితం ఇది కాదని, స్వేచ్ఛగా సంచరించడంలో నూరు శాతం రిస్కు ఉండగా, ఇలాంటి గ్రూపుల వల్ల 30 శాతం రిస్కు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment