
కృత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!
న్యూయార్క్: నెలలు తిరక్కుండానే పుట్టే పిల్లలు ఎక్కువ కాలం బతకరనేది మనకు తెల్సిందే. అలాంటి వారిని బతికించడం కోసం వైద్యులు వారిని ఇంక్యుబేటర్లలో పెట్టి కుస్తీ పట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంక్యుబేటర్లలో పెట్టిన పిల్లలు కూడా మత్యువాత పడతారు. ఇంక్యుబేటర్లలో నెలలు నిండని పసికందులను పెట్టి చికిత్స చేయడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ప్రపంచం మొత్తంగా పురిట్లోనే మరణిస్తున్న ఇలాంటి శిశువుల సంఖ్యలో ఒక్క భారత దేశంలోనే 35 శాతం మంది మరణిస్తున్నారు.
వైద్య విజ్ఞానం ఇంతగా విస్తరించిన నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి పరిస్థితికి పరిష్కారం లేదా? పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోతే భరించలేని ఆ బాధ నుంచి తల్లులను రక్షించేందుకు మార్గం లేదా? మరో మూడేళ్లలో ఈ పరిస్థితికి తప్పకుండా పరిష్కారం లభిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవల గొర్రె పిల్లలపై నిర్వహించిన ప్రయోగం విజయవంతం అవడమే అందుకు కారణం.
తల్లి గర్భంలో, అంటే ఇక్కడ గొర్రె గర్భసంచిలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా వైద్యులు ఓ పారదర్శక బ్యాగ్‌లో సష్టించారు. ఆ బ్యాగ్‌ను బయోబ్యాగ్ అని పిలుస్తున్నారు. నిర్దిష్ట కాలానికన్నా 105 నుంచి 120 రోజుల ముందు జన్మించిన ఓ ఎనిమిది గొర్రె పిల్లలను ఈ బయోబ్యాగుల్లో పెట్టి వైద్య పరిశోధకులు అధ్యయనం చేశారు. మెల్ల మెల్లగా ఆ గొర్రె పిల్లలు కదలడం, కాళ్లు, చేతులు ఆడించడం, కళ్లు తెరవడం చేశాయి. నాలుగు వారాల అనంతరం వాటిని బ్యాగుల్లో నుంచి తీసి సాధారణ వెంటి లేటర్లలో ఉంచారు. ఆ ఎనిమిది గొర్రె పిల్లలు బతకడం విశేషం. ఈ అధ్యయనం వివరాలను ‘ది వెర్జ్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు.
ఈ తరహాలోనే స్త్రీల గర్భంలో ఉండే వాతావరణాన్ని కత్రిమంగా సష్టించే మానవ బయోబ్యాగ్‌ను అభివద్ధి చేయవచ్చని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. ఈ బ్యాగులు అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలా అని స్త్రీల అవసరం లేకుండానే పిల్లలను కనవచ్చు అనుకోవడం అది సైన్స్ ఫిక్షన్ సినిమా అవుతుంది తప్ప, నిజం కాదని ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో గర్భస్త్ర పిండాలకు చికిత్సచేసే డాక్టర్ అలెన్ ఫ్లేక్ వ్యాఖ్యానించారు.