'ఫ్లోటింగ్ పియర్స్' తో నీటిపై నడవొచ్చు!
'ఫ్లోటింగ్ పియర్స్' తో నీటిపై నడవొచ్చు!
Published Mon, Jun 13 2016 9:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
ఇటలీః బల్గేరియాకు చెందిన ఎనభై ఏళ్ళ క్రిస్టో వ్లాదిమిరోవ్ జావచెఫ్ తన ఆలోచనను అమల్లోకి తెచ్చాడు. రెండు ద్వీపాల మధ్య వంతెన నిర్మించాల్సిన అవసరం లేకుండా నీటిపై నడిచే విధానాన్ని కనుగొన్నాడు. తన ఆలోచనల రూపాన్ని ప్రజలకు, ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చి గంటలకొద్దీ ప్రయాణించాల్సిన పనిలేకుండా చేశాడు.
ఇటలీలోని లాంబర్డేకు సమీపంలోని లేక్ ఐసోలో మోన్టేఐసోలో ద్వీపంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటారు. అక్కడినుంచీ లాంబర్డేకు వెళ్ళాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. పడవ ప్రయాణంతో కొద్దిపాటి దూరానికే నీటిలో గంటలదరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమయాన్ని తగ్గించాలంటే వంతెన ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమా? అది జరిగే అవకాశం ఉందా అంటూ తీవ్రంగా ఆలోచించిన క్రిస్టోకు మెరుపులాంటి ఐడియా తట్టింది. నీటిపై నడిచే విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉందేమోనన్న తన ఆలోచనకు పదును పెట్టిన క్రిస్టో రెండు ద్వీపాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు నీటిలోనే మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా గతేడాది ఫ్లోటింగ్ పియర్స్ పేరున తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. నీటిపై తేలే రహదారిని ఏర్పాటు చేసేందుకు లక్షలకొద్దీ పాలిథిన్ క్యూబ్స్ ను వినియోగించాడు. సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్రంపై తేలియాడే రోడ్డును నిర్మించి విజయం సాధించాడు. ఈ రోడ్డు మార్గం నిర్మించేందుకు సుమారు వంద కోట్ల రూపాయలను క్రిస్టో ఖర్చు చేశాడు.
ప్రస్తుతం క్రిస్టో రూపొందించిన మార్గం పరిశీలిస్తున్న అధికారులు... అన్నిరకాలుగా తట్టుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రజలు దీనిపై నడిచేందుకు అనుమతిస్తారు. వచ్చే నెల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై నడిచేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. నీటిపై తేలియాడే మార్గంలో ప్రయాణించేందుకు అత్యధిక జనాభా వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక వాలంటీర్లను, లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు.
Advertisement