
మెల్‌బోర్న్: అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో అనేకానేక అద్భుత ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యావసరంగా మారిన నేటి కాలంలో, క్షణాల్లోనే సమాచారం అరచేత వాలుతున్నా మరింత వేగంగా దానిని ఒడిసిపట్టుకునే పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని మోనాశ్, స్విన్‌బర్న్, ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీలు అద్భుతం చేశాయి. ఒకే ఒక ఆప్టికల్ చిప్ సాయంతో 44.2 టీబీపీఎస్ (టెరాబిట్స్ పర్ సెకండ్) డేటా స్పీడ్‌ను అందుకునే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ డేటా స్పీడ్‌తో సెకన్ కంటే తక్కువ సమయంలో దాదాపు 1000 హెచ్‌డీ సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. (డిజిటల్ లక్ష్యంతో శాంసంగ్, ఫేస్‌బుక్ జట్టు..)
కాగా డాక్టర్ బిల్ కోర్‌కోరన్ (మోనాశ్), ప్రొఫెసర్ డేవిడ్ మోస్ (స్విన్‌బర్న్), ఆర్‌ఎమ్‌ఐటీ ప్రొఫెసర్ ఆర్నన్ మిచెల్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. తద్వారా డేటా ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. మెల్‌బోర్న్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డార్క్ ఆప్టికల్స్ నెట్‌వర్క్ (76.6 కి.మీ.) లోడ్ టెస్టు నిర్వహించింది. ఈ మేరకు తమ ఆవిష్కణకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పొందుపరిచింది. (రీచార్జ్ చేయకుంటే కనెక్షన్ కట్: నెట్‌ఫ్లిక్స్)
ఇక తమ టెక్నాలజీ ఆస్ట్రేలియన్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడానికి మాత్రమే పరిమితం కాదని... బిలియన్ల సంఖ్యలో ఇంటర్నెట్ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్న సమయంలోనూ ఇదే స్థాయి స్పీడ్‌ను అందుకునేందుకు వీలుగా తమ పరిశోధన ఉపయోగపడుతుందని బృందం వెల్లడించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో తమ పరిశోధన చూచాయగా ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ పరిశోధనలో తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక అత్యంత వేగంతో డేటాను డౌన్‌లోడ్ చేయడానికి వీలుగా తాము రూపొందించిన కొత్త పరికరంలో 80 లేజర్లతో పాటు మైక్రో- కోంబ్‌ను ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్లలో ఈ మైక్రో కోంబ్ అత్యంత సూక్ష్మమైన, తేలికైన పరికరం.
Comments
Please login to add a commentAdd a comment