
'రాజ్ నీతీ'లో నటుడు షాకిబ్ ఖాన్
ఢాకా : ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన రాజా ది గ్రేట్ మూవీలో వాడిన ఓ ఫోన్ నెంబర్ కారణంగా విశాఖ జిల్లావాసి ఎన్ని తిప్పలు పడ్డారో తెలిసిందే. రవితేజతో మాట్లాడాలంటూ తన ఫోన్ నెంబర్ కు రోజు వందల ఫోన్ కాల్స్ రావడంతో బాధిత వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. తాజాగా ఓ ధాలీవుడ్ (బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీ) మూవీ కారణంగా తన భార్యతో విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చిందంటూ ఓ ఆటో డ్రైవర్ మూవీపై ఏకంగా 60,975 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) దావా వేశాడు.
ఆ వివరాలిలా ఉన్నాయి.. 'రాజ్ నీతి' మూవీలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు షాకిబ్ ఖాన్. అయితే మూవీ సీన్లో భాగంగా ఓసారి హీరో షాకిబ్ తన గర్ల్ ఫ్రెండ్ కు ఓ నెంబర్ ఇస్తాడు. ఇక మూవీ విడుదలైనప్పటినుంచీ తనకు మనశ్శాంతి కరువైందంటున్నాడు బంగ్లాదేశ్ ఆటో డ్రైవర్ ఇజాజుల్ మియా. తన ఫోన్ నెంబర్ ను రాజ్ నీతిలో హీరో షాకిబ్ చెప్పగా, అది చూసిన షాకిబ్ మహిళా అభిమానులు కాల్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నారని చెప్పాడు. హల్లో షాకిబ్.. ఓ రెండు నిమిషాలు మాట్లాడాలంటూ యువతులు ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన తన భార్య మోసగాడిగా భావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతిరోజు వందకు పైగా కాల్స్ రావడంతో భార్య కు ఓపిక నశించి, తనపై నమ్మకాన్ని కోల్పోయి.. చివరికి తనకు విడాకులు ఇవ్వాలని కోరినట్లు చెప్పాడు. తనకు కొద్దికాలం కిందటే వివాహం అయిందని, ఓ పాప ఉందన్నాడు. కానీ ఇతర మహిళలు, యువతులతో తనకు సంబంధం ఉందని భార్య అనుమానిస్తుందని, అందుకు మూవీలో తన ఫోన్ ఫోన్ నెంబర్ వాడకమే కారణమంటున్నాడు. ఫోన్ నెంబర్ లోకేషన్ గుర్తించిన ఓ యువతి 500 కిలోమీటర్ల నుంచి షాకిబ్ ఖాన్ అనుకుని తనను కలవడానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ తతంగానికి కారణమైన ఆ సినిమా నటుడు, నిర్మాత షాకిబ్ పై తన క్లయింట్ 50 లక్షల టాకాలు (భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) నష్టపరిహారం కోరుతూ దావా వేసినట్లు లాయర్ మాజిద్ తెలిపారు. జిల్లా కోర్టు జడ్జి విచారణ చేపట్టాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు.