మళ్లీ ‘సెక్యులర్’ దిశగా బంగ్లా అడుగులు | Bangladesh may drop Islam as country's official religion | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘సెక్యులర్’ దిశగా బంగ్లా అడుగులు

Published Mon, Mar 7 2016 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

మళ్లీ ‘సెక్యులర్’ దిశగా బంగ్లా అడుగులు - Sakshi

మళ్లీ ‘సెక్యులర్’ దిశగా బంగ్లా అడుగులు

‘ఇస్లాం’కు అధికార మత హోదా రద్దుకు ప్రయత్నాలు
* సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీనా సర్కారు
*ఇస్లాం ఛాందసవాదులకు చెక్ పెట్టే వ్యూహం?

దేశ అధికార మతంగా ఇస్లాంను రద్దు చేసి.. 1988కి ముందు లాగా లౌకిక దేశంగా మారే దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం షేక్ హసీనా ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి కాలంలో దేశంలో మత మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. వారికి రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించేందుకు హసీనా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి మైనారిటీ మత సంఘాలు మద్దతు తెలుపుతున్నా.. మెజారిటీ ప్రజలు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకమే.
 
బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. పదిశాతం మాత్రమే ఉన్న హిందు, క్రైస్తవ, షియా ముస్లింలను ఇస్లాం చాందసవాద సంస్థలు (జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్. అన్సరుల్లా బంగ్లా టీమ్) లక్ష్యంగా చేసుకున్నాయి. గత రెండేళ్లుగా ఇది మరింత ఎక్కువైంది. గత నెలలో భారత సరిహద్దుల్లోని ఓ గ్రామంలో తెల్లవారుజామున ఓ పూజారిని.. ఆలయ ప్రాంగణంలోనే కాల్చి చంపారు.

కొందరు క్రిస్టియన్ ఫాదర్‌లనూ చంపేశారు. అయితే మతం మారటం లేదంటే.. తమ అస్థిత్వాన్ని కనబడకుండా దాచుకోవటం బంగ్లా మైనారిటీల బతుకుచిత్రమైపోయింది. వేరేమతాన్ని ఆచరిస్తున్న వారికే ఈ దాడులు పరిమితం కాలేదు. అవిజిత్ రాయ్ వంటి హేతువాదులనూ, వారి రచనలను ప్రచురించినందుకు పబ్లిషర్లనూ వదల్లేదు. షియా ముస్లింల ప్రార్థనాస్థలాలపై మెజారిటీ అయిన సున్నీ అతివాదులు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవటం కూడా బంగ్లాదేశ్‌లో అస్థిరతకు కారణమైంది. ఐసిస్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అమెరికా హెచ్చరించింది. గతేడాది ఐసిస్ కూడా బంగ్లాదేశ్‌లో విదేశీయులతోపాటు మైనారిటీలను చంపినట్లు ప్రకటించుకుంది. అదంతా స్థానిక ముస్లిం ఛాందసవాద సంస్థల పనేనని బంగ్లా ప్రభుత్వం చెప్తోంది.
 
సెక్యులర్ నిర్ణయం ఎందుకు?
1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి వేరుపడి బంగ్లాదేశ్‌గా అవతరించాక నేటికీ ఆ దేశ అధికార భాష బెంగాలీనే. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నా.. ఉర్దూ, అరబిక్ భాషలకు అసలు ప్రాధాన్యమే లేదు. భారత సైన్యం సాయంతో స్వాతంత్య్రం పొందిన బంగ్లాదేశ్ 1988 వరకూ సెక్యలర్ దేశమే. 1988లో జియావుర్ రెహ్మాన్ సర్కారు రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్లాంను అధికార మతంగా మార్చేసింది.

ఇటీవలి కాలంలో మైనారిటీలపై దాడుల జరుగుతున్నా ప్రభుత్వం రాజ్యాంగపరమైన రక్షణ కల్పించలేకపోతోంది. ఈ నేపథ్యంలో 1988కి పూర్వమున్న సెక్యులర్ దేశంగా బంగ్లాదేశ్ పునర్‌ఆవిర్భవిస్తే.. పరిస్థితిలో మార్పు రావొచ్చనేది హసీనా ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఈ పిటిషన్‌కు మద్దతు పలకటం ద్వారా మెజారిటీ ప్రజల మతాన్ని కాదని.. సెక్యులర్ ముద్రకు హసీనా నిర్ణయించుకోవటం సాహసమే.
 - సెంట్రల్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement