తలాక్ ఇస్లాంలో భాగం కాదు
ఇది సమాజం అంతర్గత సంఘర్షణ మాత్రమే
- ట్రిపుల్ తలాక్ వివాదంలో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- 69 ఏళ్లుగా చట్టం తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం
- ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీందే: అటార్నీ జనరల్
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాంలో భాగం కాదని ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నందున ఈ అంశంపై న్యాయపరమైన సూక్ష్మ పరిశీలన జరగాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు. ముస్లిం మహిళలకు, పురుషులకు మధ్యనున్న తీవ్రమైన అంతరాన్ని సూచించే ఈ అంశం నుంచి కోర్టు తప్పించుకోజాలదన్నారు. రోహత్గీ ప్రశ్నలపై ధర్మాసనం స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్‌తోపాటు ముస్లిం వివాహాలపై నియంత్రణ తెస్తూ ప్రభుత్వం చట్టం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ‘కోర్టు ట్రిపుల్ తలాక్ కేసును కొట్టేస్తే మీరు (కేంద్రం) చట్టం చేస్తారా? గత 69 ఏళ్లుగా మీరు ఎందుకు చట్టం తీసుకురాలేదు’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘నేను చేయాల్సింది నేను చేస్తాను. కానీ మీరు (కోర్టు) ఏం చేస్తారనేదే ప్రశ్న?’ అని రోహత్గీ పేర్కొన్నారు.
ట్రిపుల్ తలాక్ మహాపాపం అంటూనే..
ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులతోపాటు ఇస్లాం మూల సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాదులను రోహత్గీ కోరారు. ట్రిపుల్ తలాక్ ‘మహా పాపం’, ‘అవాంఛితం’ అంటున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ అంశం మతంలో భాగమని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.‘విశాఖ వర్సెస్ రాజస్తాన్ ప్రభుత్వం’ కేసులో పనిచేస్తున్న చోట లైంగి క వేధింపుల విషయంలో ప్రత్యేక చట్టాలేమీ లేకున్నా సుప్రీం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హిందూసంప్రదాయంలోని సతీసహగమనం, దేవదాసీ, అస్పృశ్యతలు కూడా కాలానుగుణంగా నిర్మూలించబడ్డాయన్నా రు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ‘వీటిని కోర్టులు నిర్మూలించాయా? లేక చట్టాల ద్వారా రూపుమాసిపోయాయా?’ అని ప్రశ్నించింది. అయితే అలాంటప్పుడు విశాఖ కేసులో కోర్టు ఎందుకు జోక్యం చేసుకుందని రోహత్గీ తిరిగి ప్రశ్నించారు. కోర్టులు నిస్సహాయతను వ్యక్తం చేయలేవన్నారు. ‘దేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదే’ అని చెప్పారు.
ట్రిపుల్ తలాక్‌ను మహిళలు తిరస్కరించొచ్చా?
నిఖానామా (వివాహ ఒప్పందం) సమయంలో ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే అవకాశం కల్పిస్తారా? అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్)ను ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పే లా నిఖానామా సమయంలో మహిళలకు అవకాశం కల్పించే నిబంధనను తేవాలని సూచించింది. ‘దీన్ని అమల్లోకి తీసుకురావటం ఏఐఎంపీఎల్‌కు సాధ్యమేనా? ఖాజీలంతా ఈ ఆదేశాలను పాటిస్తారా?’ అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది యూసుఫ్ హతీమ్ ముచ్ఛాల స్పందిస్తూ.. ఏఐఎంపీఎల్ ఆదేశాలను ఖాజీలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న వారిని సామాజికంగా బహిష్కరించాలని ఏప్రిల్ 14న పర్సనల్ లా బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఎవరూ పాటించటం లేదన్నారు.