న్యూఢిల్లీ: ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చే మత సంప్రదాయం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, తీర్పు చరిత్రాత్మకమని, ముస్లిం మహిళల సాధికారికతను ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా స్పందిస్తూ, ఈ తీర్పు ముస్లిం మహిళలకు, వారు గౌరవంగా జీవించే హక్కుకు విజయమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు కొత్త భారత ఆవిర్భావానికి ముందడుగు అని కూడా అన్నారు.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ అసలు స్పందించ లేదు. పార్టీ తరఫున పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రణ్‌దీప్ సుర్జేవాలా తీర్పు గురించి మాట్లాడుతూ ఎంతోకాలంగా వివక్షంగా గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుందని, మహిళల హక్కులకు మరింత ధ్రువీకరణ లభించినట్లయిందని డొంక తిరుగుడుగా స్పందించారు. ఇక సాయంత్రం వరకు ఈ అంశంపై మౌనం పాటించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు స్పందించారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, న్యాయ కోసం పోరాడిన మహిళలను అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
మొదటి నుంచి ముస్లిం మైనారిటీ ఓట్లను దష్టిలో పెట్టుకొని ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగిన ఉద్యమానికి హదయపూర్వకంగా మద్దత ప్రకటించలేదు, అలాఅని వ్యతిరేకించలేదు. తటస్థంగానే ఉంటూ వచ్చింది. సహజంగానే ముస్లింల వ్యతిరేక భావాజాలం కలిగిన భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటి నుంచి తలాక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నెత్తికెత్తుకుంది. ఉత్తరప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. సాధారణంగా మహిళల హక్కులను ప్రోత్సహించే కాంగ్రెస్ పార్టీ మాత్రం ట్రిపుల్ తలాక్‌పై తన వైఖరిని తేల్చుకోలేక పోయింది. ట్రిపుల్ తలాక్ వ్యతరేకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకోవడం, మహిళల హక్కుల కోసం పోరాటం జరిపేది ఒక్క బీజేపీ మాత్రమేనని పార్టీ ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ యూపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరింది. ఆ ఎన్నికల్లో మొదటిసారి ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసినట్లు అంచనాలు ఉన్నాయి.
మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా మోదీ తలాక్ అంశాన్ని ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని ఎత్తి చూపడం వల్ల మైనారిటీలను విమర్శించినట్లవుతుంరని, మైనారిటీ మహిళలను ఆకర్షించవచ్చని, ఇంకోపక్క హిందూ ఓట్లను సమీకరించుకోవచ్చన్నది మోదీ వ్యూహం. ఓ పక్క మోదీ వ్యూహాలు విజయం సాధిస్తుండగా, ఏ వ్యూహం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా వెనకబడి పోతున్నది.
నీకు మౌనమేల సోనియా!
Published Wed, Aug 23 2017 3:05 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement