నాడు దొంగ-పోలీస్.. నేడు ఆర్మీ-టెర్రరిస్ట్!
కళ్లముందు జరిగేవాటిని పిల్లలు యథాతథంగా ఆటల రూపంలోకి మార్చేస్తారు. పాత కాలంలో అయితే దొంగ - పోలీసు లాంటి ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడు టీవీలు వచ్చాయి.. ఏం జరుగుతోందో వెంటనే తెలుస్తుంది. దాంతో దాన్నే తమ ఆటగా మార్చేసుకుంటున్నారు. ప్రస‍్తుతం బంగ్లాదేశ్లో ఉగ్రవాదుల కాల్పులు సంచలన టాపిక్. అదే అంశాన్ని అక్కడి పిల్లలు ఆటలా మార్చుకున్నారు. ఒక బృందం భద్రతా దళాలుగాను, మరో బృందం ఉగ్రవాదులుగాను మారిపోయి ఉగ్రదాడి ఆట ఆడుకున్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోడానికి భద్రతా దళాలు ఇష్టపడనట్లుగా వీళ్లు ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భద్రతా దళాలు సరైన సమయంలో స్పందిస్తే ఇంత దాడి జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు. వాళ్ల మనోభావాలు పిల్లల ఆటలో ప్రతిబింబించాయి.
వీడియోలో ఇంకా.. తమ వద్ద బందీలుగా ఉన్న పిల్లలను ‘మీరు ముస్లింలేనా’ అని అడగడం, కాదంటే పీకలు కోసేయడం లాంటివి కూడా పిల్లల ఆటలో కనిపించాయి. ఇదంతా ఆటే అయినా.. ఉగ్రవాద దాడి లాంటి ఘటనలు పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో స్పష‍్టంగా తెలుస్తోంది. ఉగ్రదాడికి ఎవరిని తప్పుపట్టాలో కూడా తెలియని అమ్మాయి పాత్ర (బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా) కూడా పిల్లల వీడియోలో ఉంది. ఉగ్రవాదులుగా నటించిన పిల్లలు బందీలందరినీ చంపేసి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఆర్మీవాళ్లు అక్కడికొచ్చి సంబరం చేసుకుంటారు.