
జర్నలిస్టు సుబర్ణ నోది( ఫైల్ ఫోటో)
ఢాకా: బంగ్లాదేశ్ లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య కలకలం రేపింది. పాబ్నా నగరంలో తన ఇంటి వద్ద తెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం మోటార్ సైకిళ్లపై దాదాపు 10-12 మంది సాయుధులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చారు. అనంతరం కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే ముందస్తు పథకం ప్రకారం పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇబ్నె మిజాన్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదనీ, విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు పాబ్నాలోని పాత్రికేయులు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. హంతకులకు కఠినమైన శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. కాగా సుబర్ణ నోది ఆనంద టీవీ ఛానల్‌లో న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. డైలీ జాగృతో బంగ్లా పత్రికకు జర్నలిస్టుగా కూడా సేవలందించారు. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి జీవిస్తున్న ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment