బీజింగ్ : ప్రపంచ దేశాలు, ఆర్థిక వ్యవస్ధల్లో అల్లకల్లోలం రేపిన కరోనా మహమ్మారిని చైనాలోని ఓ ల్యాబ్‌లో సృష్టించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసిందని చైనా విదేశాంగ శాఖ గురువారం పేర్కొంది. 2019 చివరిలో ప్రాణాంతక వైరస్‌ను గుర్తించిన వుహాన్ ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో కరోనా వైరస్‌ను పుట్టించారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించలేదని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు.
కాగా కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో సృష్టించారా అనే అంశాన్ని తమ ప్రభుత్వం నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. వైరస్‌పై తమకు తెలిసిన అంశాలతో చైనా నిజాయితీగా ప్రపంచం ముందుకు రావాలని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కోరారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,94,839 కరోనా కేసులు నమోదవగా, 1,35,569 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. 5,20,000 మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment