‘పెన్సిల్‌’ వెనక పెద్ద చరిత్రే ఉంది! | A Big History Behind Pencil | Sakshi
Sakshi News home page

‘పెన్సిల్‌’ వెనక పెద్ద చరిత్రే ఉంది!

Published Sat, Jun 1 2019 5:11 PM | Last Updated on Sat, Jun 1 2019 5:12 PM

A Big History Behind Pencil - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ :ఐదు వేల సంవత్సరాల మానవ జాతి వికాసంలో ‘పెన్సిల్‌’ నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. ఆదిమానవుడు బొమ్మలు గీయడానికి మొట్టమొదట సీసంను, రంగు రాళ్లను ఉపయోగిస్తే నాగరికత నేర్చుకున్న మానవుడు రాయడానికి, గీయడానికి సీసంను ఉపయోగించారు. ఆధునిక మానవుడు గ్రాఫైట్‌తో చేసిన పెన్సిల్‌ను ఉపయోగిస్తున్నారు. పెన్సిల్‌ లేకపోతే మన ఆధునిక విద్యా వికాసమే లేదంటే అతిశయోక్తి కాదు. పెన్సిల్‌ అనే పదం ‘పిన్సిల్‌’ అనే ఫ్రెంచ్‌ పదం, ‘పిన్సిలస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఆ పదాలకు అర్థం ‘చిన్న కుంచె’ అని. ఒకప్పుడు చిత్రకారులు ఒంటె తోక వెంట్రుకలను ఉపయోగించి పెయింటింగ్‌ కుంచెలను తయారు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘పెన్సిల్‌’కు ఆ పేరు పెట్టారు. 


నెపోలియన్‌ ఆర్మీలో పనిచేసిన నికోలస్‌ జాక్వస్‌ కాంటే అనే శాస్త్రవేత్త 1795లో ఆధునిక పెన్సిల్‌ను కనుగొన్నారు. ఆయన నీళ్లు, బంక మట్టి, గ్రాఫైట్‌ ఖనిజాన్ని ఉపయోగించి బట్టీలో 1900 డిగ్రీల ఫారిన్‌హీట్‌ వద్ద వేడిచేసి పెన్సిళ్లను తయారు చేశారు. ఇరువైపుల బంకమట్టి బద్దల మధ్య గ్రాఫైట్‌ బద్దను ఘనీభవించి వాటిని తయారు చేసే వాళ్లు. అవసరాలనుబట్టి నాలుగు మూలలు, గుడ్రిటి పెన్సిళ్లను కూడా తయారు చేశారు. కాలక్రమంలో కర్ర పెన్సిళ్లు వచ్చాయి. పెన్సిల్‌లో ఉపయోగించే గ్రాఫైట్‌ ఖనిజ నిల్వలను  మొట్టమొదట 16వ శతాబ్దంలో యూరప్‌లో కనుగొన్నారు.

కార్బన్‌కు రూపాంతరమైన ఈ గ్రాఫైట్‌ గనులను ఇంగ్లీష్‌ లేక్‌ డిస్టిక్ట్‌లోని కెస్విక్‌ వద్ద 1564లో కనుగొన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అందుకని కెస్విక్‌ పరిసర ప్రాంతాల్లో 19వ శతాబ్దంలో పెన్సిల్‌ పరిశ్రమ విస్తరించింది. 1832లో ‘బ్యాంక్స్, సన్‌ అండ్‌ కంపెనీ’ పేరిట మొట్టమొదటి పెన్సిల్‌ పరిశ్రమ ఏర్పాటయింది. అదే కాలక్రమంలో ‘డెర్వంట్‌ కంబర్‌లాండ్‌ పెన్సిల్‌ కంపెనీ’గా రూపాంతరం చెందింది. కంబర్‌లాండ్‌ పెన్సిళ్లను ప్రపంచంలోనే  నాణ్యమైన పెన్సిళ్లుగా పరిగణిస్తారు. కారణం అక్కడ దొరికే గ్రాఫైట్‌కు దుమ్మూ దూళి ఉండదు. 

మధ్యయుగంలో
మధ్యయుగంలో మానవులు బొమ్మలు గీసేందుకు సీసం, రంగురాళ్లను ఉపయోగించేవారు. చివరి గోథెక్‌ లేదా యూరప్‌ పునరత్థానం (14 నుంచి 17వ శతాబ్దం)కాలంలో మానవులు బొమ్మలు గీసేందుకు రాసేందుకు మూడు రకాల సీసం రాళ్లును ఉపయోగించేవారు. ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు జాన్‌ వాన్‌ ఐక్, లియోనార్డో డావిన్చీ, ఆల్‌బ్రెక్ట్‌ డ్యూరర్, రాఫేల్‌లు ఈ సీసం రాళ్లను ఉపయోగించి బొమ్మలు గీశారు. సీసంతో రాస్తే వెండి రంగులో కనిపిస్తుంది.

వాటిని ఇప్పటి సిరాతో సులభంగానే చెరిపేయవచ్చు. చెరిపేసినా సులభంగా చెరిగిపోకుండా ఉండేందుకు ఆ సీసం రాళ్ల నుంచి ‘సిల్వర్‌ పాయింట్‌’ను కళాకారులు కనుగొన్నారు. ఆటవికుల సున్నపు రాయి నుంచి ఇప్పటి ఆధునిక పెన్సిల్‌ వరకు దాదాపు దాదాపు వంద రూపాలు సంతరించుకుందని ప్రస్తుతం లండన్‌లో బ్రిటీష్‌ లైబ్రరీ మ్యూజియం రాత చరిత్ర మీద  నిర్వహిస్తోన్న ఓ ఎగ్జిబిషన్‌ తెలియజేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement