ఇక విమానాల్లో సుఖ ప్రయాణం
న్యూయార్క్: ఒకప్పటితో పోలిస్తే విమాన చార్జీలు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గాయి. అయినా ప్రయాణికుల ఫిర్యాదులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇరుకైన సీట్లలో సర్దుకోలేక సతమతమవడం, సీటు హ్యాండిల్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయాణికులు ఒకరి మోచేతులను ఒకరు తోసేసుకోవడం, చంటి పిల్లల ఏడుపులను భరించలేక పోతున్నామంటూ గోల చేయడం తరచు బయటకు వినిపించే ఫిర్యాదులు.
విమాన ప్రయాణ బడలికను ప్రయాణికులు అనుభవిస్తారేగానీ పెద్దగా బయటకు మాట్లాడరు. తలనొప్పి రావడం, కళ్లుతిరగడం, కళ్లు మండడం, వాంతివచ్చినట్లవడం, నోరు ఎండిపోవడం, ఊపిరాడకపోవడం, అన్నీ కలిసి భరించలేని అసహనం కలగడం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలను వైమానిక పరిభాషలో ‘జెట్ ల్యాగ్’ అని పిలుస్తారు. కమర్షియల్ విమానంలో, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ప్రతి ప్రయాణికుడికి ఇలాంటి సమస్యలు తప్పవు. సముద్రం లేదా నేలకు అత్యంత ఎత్తులో విమానాలు ప్రయాణిస్తాయి కనుక అంత ఎత్తులో ఉండే వాతావరణం ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
3,800 అడుగులు ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు విమానం లోపల 8,000 అడుగుల ఎత్తులో ఉండే ఒత్తిడి ప్రయాణికులపై పడుతుంది. అంటే ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్న బొగోటా, కొలంబియా పర్వతాల్లో లేదా కొలరాడోలోని స్కై రిసార్ట్‌లో ఉండే వాతావరణ పరిస్థితి విమానంలో కూడా ఉంటుంది. తలనొప్పి, ఊపిరి పీల్చుకోవడం లాంటి జెట్ ల్యాగ్ సమస్యలు అక్కడికెళ్లే పర్యాటకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి విమానాల్లో ఇలాంటి సమస్యల నుంచి విముక్తి లేదా?
ఇలాంటి సమస్యలను కొత్త తరం విమానాలు ఎక్కువ వరకు అధిగమించాయి. ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ 350’ విమానాలు ఆ కోవకు చెందినవే. వీటిలో సీట్లు విశాలంగా సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా 18 గంటలపాటు ఏక బిగినా ప్రయాణించినా ప్రయాణికులకు ‘జెట్ ల్యాగ్’ సమస్యలు పెద్దగా ఎదురుకావు. ఈ విమానాలు 3,800 అడుగుల ఎత్తులో ప్రయాణించినప్పటికీ విమానం లోపల 6000 అడుగుల ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అందుకు కారణం విమానాల నిర్మాణంలో కార్బన్‌తో బలోపేతం చేసిన తేలికైన పటిష్టమైన ప్లాస్టిక్ పరికరాలతోపాటు హైటెక్ మెటీరియల్ ఉపయోగించడమే. ఈ విమానాల్లో కావాల్సిన మేరకు తేమ ఉండడం కూడా మరో విశేషం. గాలిలో తేమను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక పరికరాలేమీ లేవు. ప్రయాణికుల శ్వాస నుంచి ఉత్పన్నమయ్యే తేమనే ఉంటుంది. మామాలు కమర్షియల్ విమానాల్లోనైతే ఈ తేమ వల్ల పరికరాలు పాడవుతాయి. మరమ్మతులు అవసరమవుతాయి.
కొత్తతరం విమానాల్లో కార్బన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల తేమ వల్ల ప్రమాదం లేదు. అయితే ఈ కొత్త విమానాలు అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలంటే మరో దశాబ్దం పాటు నిరీక్షించాల్సిందే. ఎయిర్‌బస్ ఏ 350 విమానాల కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలు 810 అర్డర్లను మాత్రమే ఇచ్చాయి. వీటిలో 67 ఆర్డర్లు ఒక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చినవే. ఇక 787 విమానాల కోసం ప్రపంచ దేశాలు 1200 విమానాల కోసమే ఆర్డర్లు ఇచ్చాయి.