ఫ్లైట్ ఎక్కుతున్నారా?
జెట్‌లాగ్
ఫ్లైట్ జర్నీ వల్ల చాలామంది ‘జెట్‌లాగ్’ సమస్యతో బాధపడుతుంటారు. ‘జెట్‌లాగ్’కు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు దీనికి ముఖ్యకారణమట. ‘జెట్‌లాగ్’ వల్ల బీపీలో హెచ్చుతగ్గులు, అజీర్తి, ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం...
ఫ్లైట్ ఎక్కడానికి ముందు...
{పయాణానికి వారం రోజుల ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం, కెఫీన్‌కు దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం మరచిపోకండి.
ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా వెళ్లండి. ఫ్లైట్ టైమ్ అయ్యే వరకు ఒకే చోట కూర్చోకుండా అందర్నీ చూస్తూ అటూ ఇటూ తిరగండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
టేకాఫ్‌కు ముందు తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సలాడ్లు తీసుకోండి. వాటితో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కూడా మంచిది.
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు...
విమానంలో ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండటం చాలా ముఖ్యం. టీ, కాఫీ అలవాటు ఉంటే, వాటి బదులు కెఫీన్ లేని హెర్బల్ టీ తాగడం మంచిది.
రిలాక్సేషన్ కోసం మంచి సినిమా చూడడం, మ్యూజిక్ వినడం, మంచి పుస్తకం చదవడం లాంటివి చేయండి. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే, వెంటనే ఈ పనులన్నీ మానేసి హాయిగా నిద్రలోకి జారుకోండి.
నిద్రాభంగం కలగకుండా ఉండేందుకు ‘డోన్ట్ డిస్టర్బ్’ బోర్డు పక్కనే పెట్టుకోండి. దానివల్ల నిద్రపోతున్నప్పుడు మిమ్మల్నెవరూ అనవసరంగా లేపరు.
కళ్లకు మాస్క్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని, ఫ్రైట్ కుషన్స్‌పై కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ స్ప్రే చేసి పడుకుంటే పూర్తి విశ్రాంతి దొరుకుతుంది.
విమానం దిగాక...
కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి టైమ్‌కు అనుగుణంగా మీ వాచ్ టైమింగ్‌ను మార్చేసుకోండి. మన ఇంటి దగ్గర ఇప్పుడెంత టైమ్ అవుతుందో అనే ఆలోచనలు మానుకోండి.
మీరు వెళ్లిన చోటుకు, మీరు నివసించిన చోటుకు టైమింగ్స్‌లో వ్యత్యాసం ఉండొచ్చు. కాబట్టి వెళ్లగానే అతిగా నిద్ర పోవడం ఆరోగ్యకరం కాదు. ఒకవేళ తప్పకుండా కునుకు తీయాల్సిందే అనుకుంటే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య పడుకోవచ్చు. అదీ 20 నిమిషాలు మించకుండా చూసుకునేందుకు అలారం పెట్టుకోండి.