జాతి విద్వేషం: అమెరికా బుడ్డోడి ధీటైన జవాబు!
వాషింగ్టన్: అమెరికాలో జాతి విద్వేష దాడుల నేపథ్యంలో విదేశీయులు బిక్కుబిక్కు మంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఐదేళ్ల అమెరికన్ బుడ్డోడు తన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జాత్యహంకార దాడులకు పాల్పడే వారు ఈ బాలుడు పోస్ట్ చేసిన ఫేస్ బుక్ వీడియో చూసి ఎంతో సిగ్గుపడాలి. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని కెంటూకీకి చెందిన శ్వేతజాతి బాలుడు జాక్స్(5) తన ఫ్రెండ్ నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్(5)కు మద్థతుగా నిలవాలని భావించాడు.
అనుకున్నదే తడవుగా తన తల్లితో మాట్లాడి ఫ్రెండ్ రెడ్డి గిగిల్ లాగా కటింగ్ (హెయిర్ కట్) చేయించుకున్నాడు. అంతకుముందు స్పైక్స్ తో మంచి హెయిర్ స్టెయిల్ తో ఉండే జాక్స్ ను చూసి టీచర్లు షాకయ్యారు. విషయం అడిగితే.. తన ఫ్రెండ్ ను చూపిస్తూ ఇప్పుడు మేం ఇద్దరేం ఒకేలా ఉన్నామని.. మా మధ్య ఏ తేడా లేదు కదా అంటూ అడిగాడు. అప్పుడు నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్ సంతోషంగా జాక్స్ ను ఆలింగనం చేసుకుంటాడు.
'జాక్స్ అంటే నేనే.. ఐ యామ్ జాక్స్' అని మా ఇద్దరిలో ఎలాంటి మార్పులేదని రెడ్డి గిగిల్ అంటాడు. ఈ విషయాలను షూట్ చేసిన జాక్స్ తల్లి కుమారుడి కోరిక మేరకు ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అందరూ ఒకటేనని చెప్పేందుకు తాను ఇలా హెయిర్ కట్ చేయించుకున్నానని జాక్స్ చెప్పాడు. జాతి విద్వేష దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు బుడ్డోడు జాక్స్ ను అభినందిస్తున్నారు. ఆ బాబును చూసయినా కొందరు బుద్ధి తెచ్చుకోవాలని, ఇలాంటి దాడులకు జాక్స్ ధీటైన జవాబిచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు.