బార్బీ బొమ్మకాదు భామే! | Brazilian 'Human Barbie' with a 20-inch waist and a 32F chest claims her doll-like features are real | Sakshi
Sakshi News home page

బార్బీ బొమ్మకాదు భామే!

Published Thu, Dec 17 2015 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

బార్బీ బొమ్మకాదు భామే!

బార్బీ బొమ్మకాదు భామే!

బ్రెజీలియా: నడుమెక్కడే నీకు నవలామణి.....అని పిలిపించుకోవడం కోసం బాలీవుడ్ భామలు డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవడం, అవసరానికి మించిన వ్యాయామాలు చేయడం పనిగా పెట్టుకుంటున్నారు. అదే పాశ్చాత్య భామలు మరో అడుగు ముందుకేసి బార్బీ బొమ్మల్లే కనిపించేందుకు సర్జరీల మీద సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇలాంటివేవి చేయకుండానే బ్రెజిల్‌కు చెందిన ఓ భామ అచ్చం మానవ బార్బీలాగా సోషల్ వెబ్‌సైట్లలో విశేషంగా ఆకర్షిస్తోంది. బార్బీ బొమ్మలాగే ఆమె నడుం సైజు కూడా 20 అంగుళాలే. చెస్ట్ సైజ్ 32 ఎఫ్ఫే. కలువల్లాంటి కన్నులకు కాంటాక్టు లెన్స్‌లు అమర్చుకొని విశాలమైన కనుకొనల చూపులతో కవ్విస్తున్నారు.

ఆమెకు యూట్యూబ్‌లో ఆరు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతమందిని ఆకర్షిస్తున్న ఆన్‌డ్రెస్సా దామియాని తన సొంత సిటీ బ్లూమెనావులో మాత్రం చూపరులను బెదరగొడుతున్నారు. ఆమెను చూడగానే బాటసారులు పిచ్చిదనుకొని పారిపోతున్నారట. సన్నటి నడుం కోసం కడుపు మాడ్చుకునే పిచ్చేమిటని ముఖ పరిచయం ఉన్నవాళ్లు ఈసడించుకుంటున్నారట.

 ‘అమ్మతోడు నాకు ఎలాంటి పిచ్చిలేదు. బొమ్మలా కనిపించడం కోసం నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. ఎలాంటి డైట్‌ను పాటించడం లేదు. కసరత్తులు చేయడం లేదు. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తడం మాత్రం చేస్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచే ఇంతే! బొమ్మలాగా ఉన్నాను. అలాగే పెరిగాను. బంధుమిత్రులు బొమ్మలాగా ఉన్నావంటే బాధ పడ్డానే తప్ప అప్పుడెన్నడూ ఆనందించలేదు. 20 ఏళ్ల ప్రాయం వచ్చాకే బొమ్మలాగా, ముఖ్యంగా బార్బీలాగా ఉంటే మంచిదేకదా అనుకున్నాను. మరింత బార్బీలాగా కనిపించడం కోసం కళ్లలో కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నాను. కనురెప్పలకు నల్లటి మేకప్ పెన్సిల్ వాడుతున్నాను. బొమ్మల్లే ఎక్కువగా గులాబీ దుస్తులు ధరిస్తున్నాను అంతే. నాలాగా బొమ్మల్లే ఉండాలనుకునేవారికి మేకప్ టిప్స్ ఇస్తున్నాను’ అని దామియాని తన గురించి చెప్పుకుంది.

 ‘ఎల్సా స్టైల్ మేకప్’ పేరిట ఆమె యూట్యూబ్ వీడియోలో చూపిస్తున్న మేకప్ పాఠాలకు విశేష ఆదరణ లభిస్తోంది. డిస్నీ క్యారెక్టర్ ఎల్సాలా ఉండడం వల్ల ఆమె నిక్‌నేమ్ ఎల్సా అయింది. ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోకుండా చిన్పపాటి మేకప్‌తో బార్బీ బొమ్మలాగా కనిపించేవారు ప్రపంచంలో మరో ఇద్దరున్నారు. వారిలో ఒకరు 26 ఏళ్ల రష్యా మోడల్ ఏంజెలికొనేవా. ఆమెకు కూడా సోషల్ వెబ్‌సైట్లలో విశేష ఆదరణ ఉంది. అలాగే ఉక్రెయిన్‌కు చెందిన బాలేడాన్సర్, మోడల్  34 ఏళ్ల వెలిరియా కూడా తనదైన శైలిలో ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement