బ్రేకప్.. వీజీయే.. | Break- Up Outsourcing: Only $15 for a Break-Up | Sakshi
Sakshi News home page

బ్రేకప్.. వీజీయే..

Published Tue, Nov 24 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

బ్రేకప్.. వీజీయే..

బ్రేకప్.. వీజీయే..

దీనికి కూడా ఔట్‌సోర్సింగ్ 
అమెరికా, కెనడాలో కొత్త ఆన్‌లైన్ సర్వీసు

 ఓ బంధానికి బ్రేకప్ చెప్పడం.. ప్రియురాలితో విడిపోవడం బాధాకరం.. కష్టతరం.. అయితే.. ఇప్పుడిక నో ఫికర్.. అన్ని సర్వీసుల్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తున్నట్లే బ్రేకప్ చెప్పడాన్ని కూడా ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేయొచ్చు! ఇందుకోసం 'ద బ్రేకప్ షాప్'(breakupshop.com) అనే ఆన్‌లైన్ సర్వీసు ఇటీవలే ప్రారంభించారు. కెనడాకు చెందిన మెకంజీ, ఇవాన్‌లు ఈ వినూత్న సర్వీసు సృష్టికర్తలు. వీళ్లిద్దరూ సోదరులు. ఏమిటీ చిత్రమైన సర్వీసు అని అడిగితే.. తమ సొంత అనుభవమే ఈ సర్వీసు ప్రారంభించడానికి కారణమైందట. వీళ్లలో ఒకరికి అతడి ప్రియురాలు అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పేసిందట. అప్పుడతడు పడిన బాధ వర్ణనాతీతమట. దీంతో బ్రేకప్ సందర్భంగా ఇరు వర్గాలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా.. వారి స్నేహ బంధానికి ఇబ్బంది కలగకుండా చేసేందుకు ఈ సర్వీసును ప్రారంభించారట.  
 చెప్పే పద్ధతిని బట్టి చార్జీలు..
 ఇందులో బ్రేకప్ చెప్పడానికి పలు పద్ధతులు ఉంటాయి. ఆయా రకాలను బట్టి చార్జీలు ఉంటాయి. ఈమెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ బ్రేకప్‌కు రూ.660, లేఖ ద్వారా అయితే రూ.1,300, స్వయంగా ఫోన్ చేసి చెప్పాలంటే రూ.1,900, ఎస్‌ఎంఎస్‌తోపాటు బొకేను పంపాలంటే రూ.3,100  చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి బ్రేకప్ గిఫ్ట్ ప్యాక్ అయితే వస్తువులను బట్టి రకరకాల ధరలు ఉన్నాయి. రూ.5,300 నుంచి ఇది ప్రారంభమవుతుంది. వీటిల్లో చాక్లెట్లు, 'ద నోట్‌బుక్' లాంటి హాలీవుడ్ రొమాంటిక్ సినిమా డీవీడీ, వీడియో గేమ్ వంటివి ఉంటాయి.
 ఇదెలా పనిచేస్తుంది?
 బ్రేకప్ సర్వీసు కోసం మనం ఆన్‌లైన్‌లో సంప్రదించగానే.. అదనపు సమాచారం నిమిత్తం మనకో ఫోన్ కాల్ వస్తుంది. మనం ఎందుకు ఈ బంధాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాం? విడిపోవడానికి కారణాలేమిటి? వంటి వివరాలు తెలుసుకుంటారు. తర్వాత మనం ఎంచుకున్న బ్రేకప్ పద్ధతిని బట్టి.. ముందుగా ఆ సంస్థకు చెందిన వాళ్లు.. మనం ఎవరికైతే బ్రేకప్ చెప్పాలనుకుంటున్నామో.. వాళ్లకు చాలా మర్యాదగా.. అటువైపు వారు ఎటువంటి ఆగ్రహావేశాలకు గురికాని రీతిలో విషయాన్ని  చేరవేస్తారు.

ఇందుకు సంబంధించిన కారణాలను వారికి విడమరిచి చెబుతారు. సానుభూతి తెలియజేస్తారు. మీ భవిష్యత్తు ఎంతో బాగుండాలంటూ ఆకాంక్షిస్తారు. ప్రస్తుతానికైతే.. మెకంజీ, ఇవాన్‌లే ఈ కాల్స్ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి.. మరింత మందిని రిక్రూట్ చేసుకుంటామని చెబుతున్నారు.  ఈ సర్వీసు కొత్త తరహాదని.. చాలా మందికి ఇదో పిచ్చి వ్యవహారంలా అనిపించినా.. భవిష్యత్తులో ఇది బాగా సక్సెస్ అవుతుందని మెకంజీ, ఇవాన్‌లు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement