బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర
అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు బ్రిటన్ యువరాజు హారీ హత్యకు కుట్రపన్నారు. ఆయనను బంధించి చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. అఫ్ఘాన్లో బ్రిటీష్ దళాల తరపున హారీ పనిచేస్తున్నప్పడు ఈ సంఘటనలు జరినట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. తాలిబన్ నాయకుడు ఖ్వారీ నస్రుల్లా ఓ పాకిస్థాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పినట్టు వెల్లడైంది.
'అఫ్ఘాన్కు హారీ వచ్చినపుడు మా సభ్యులు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నించారు. అమెరికా కోసం పోరాటం చేస్తున్న ఓ సాధారణ సైనికుడిగానే హారీని పరిగణించాం. ఆయన బ్రిటన్లో యువరాజే అయినా మా దృష్టిలో ఓ సైనికుడు మాత్రమే. హారీని చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాం కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు' అని తాలిబన్ నేత చెప్పాడు. మొదటిసారి 2008-12 మధ్య కాలంలో అఫ్ఘాన్ వెళ్లిన హారీ సైన్యంలో హెలికాప్టర్ పైలట్గా పనిచేశారు.