సెయింట్ జార్జి చర్చిలో మేఘన్ మార్కల్‌కు ఉంగరం తొడుతున్న ప్రిన్స్ హ్యారీ
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్‌ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్‌లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను..
బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్‌పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు.
హాజరైన ప్రియాంక చోప్రా..
వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు.
వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు
వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా
వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్‌లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment