పిల్లల్ని కనడమే అతని బిజినెస్
లండన్: పిల్లల్ని కనడమే అతని బిజినెస్. ఇప్పటివరకు 20 మంది ప్రియురాళ్ల ద్వారా 40 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో సగం మంది పిల్లల పేర్లు కూడా అతనికి గుర్తు లేదట. వారిలో కొందరుపిల్లలు తన కళ్ల ముందునుంచి వెళ్తున్నా అతను గుర్తించలేడట. ఎవరి విషయంలోనైనా డౌటొస్తే వారు తన పిల్లలేనా, కాదా అన్న విషయం నిర్ధారించుకోడానికి వారిని పిలిచి వీపు చూస్తాడట. ఎందుకంటే తనకు పుట్టిన ప్రతి సంతానం వీపుపైన వాళ్ల పేరును, దాంతోపాటు వంశవృక్షాన్ని పచ్చబొట్టు పొడిపించాడు. ఛానల్-5 కార్యక్రమానికి హాజరైన ఆ పిల్లల తండ్రి తన పూర్తి వివరాలను వెల్లడించాడు.
బ్రిటన్‌లోని మాన్‌మౌత్‌షైర్‌లో నివసిస్తున్న అతని పేరు మైక్ హాల్పిన్. అతనికి ప్రస్తుతం 53 ఏళ్లు. అతనికి మూడేళ్ల నుంచి 37 ఏళ్ల వయస్సుగల 40 మంది పిల్లలున్నారు. తనకు తెలియకుండా ఇంకా కొంతమంది పిల్లలుండొచ్చని అతని అనుమానం. ఒకరిద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఉద్యోగం చేసేవాడట. పిల్లలు పెరగడంతో వారి పోషణార్థం బ్రిటన్ ప్రభుత్వం భత్యం చెల్లించడం మొదలయ్యాక పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడట. ప్రస్తుతం అతనికి ప్రభుత్వం ఏడాదికి రూ. 25 లక్షల వరకు చెల్లిస్తోంది. ఈలోగా తనకు మద్యం అలవాటు ఎక్కువవడంతో పిల్లల పోషణ భారమైందట. దీంతో సామాజిక సేవా సంస్థలు 26 మంది పిల్లల్ని దత్తత తీసుకొని పోషిస్తున్నాయట. మద్యం అలవాటు నుంచి బయటపడేందుకు తాను కూడా తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం హాల్పిన్ ప్రభుత్వ హాస్టల్లో ఫియాన్సీ డయానా మోరిస్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాళ్లతో సెక్స్‌లో పాల్గొనడం, వారి ద్వారా సంతానం కనడం మాత్రం ఎప్పటికీ ఆపనని చెప్పాడు. పిల్లలు దేవుడిచ్చిన వరాలని, కుటుంబ నియంత్రణ పాటించడం మహాపాపమని, ఒంట్లో శక్తి ఉన్నంతవరకు పిల్లల్ని కంటూనే ఉంటానంటూ 'గో ఫోర్త్ అండ్ మల్టీప్లై' అనే బైబిల్ సూక్తిని వల్లించాడు. ఎంతమంది ఫియాన్సీలతో తిరిగినా తమకభ్యంతరం లేదని, పిల్లలకు మాత్రం ఫుల్‌స్టాప్ పెట్టమని బ్రిటన్ టాక్స్ పేయర్స్ గొడవపెడుతున్నారు.