లండన్: సిప్రస్ లో తన భార్యను చంపిన కేసులో ఓ హంతకుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బ్లడ్ క్యాన్సరుతో బాధపడుతున్న భార్య జానీస్ హంటర్ బాధను తట్టుకోలేక తానే చంపమని కోరిందని, తప్పని పరిస్థితుల్లో నిందితుడు డేవిడ్ హంటర్ ఆమె ఆత్మహత్యకు సాయం చేశాడని హంతకుడి తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది. డేవిడ్ హంటర్ నరహంతకుడిగా అనిపించడం లేదని తెలిపింది.
డేవిడ్ హంటర్(76) భార్య జానీస్ హంటర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోవడంతో చివరి రోజుల్లో ఆమె నొప్పిని భరించలేకపోయింది. బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మేలని తరచూ భర్తకు గోడు వినిపించేది. చివరికి ఒకరోజు బాధ తీవ్రం కావడంతో తనను చంపి నొప్పి నుండి విముక్తి కలిగించమని భర్తను వేడుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య అంత వేదన భరించడాన్ని చూడలేకపోయిన హంటర్ మరో ప్రత్యామ్నాయం లేక 2021 డిసెంబర్లో భార్యను కడతేర్చాడు.
దీంతో హంటర్ పై హత్యా నేరం మోపబడింది. భార్య ఆవేదన తట్టుకోలేకే ఆమెను చంపినట్టు హంటర్ పదేపదే కోర్టుకు విన్నవించాడు. అతని తరపు వకీలు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చారు. తన భార్య చివరి రోజుల్లో చూడ విహీనంగా తయారైన తన ఆకృతిని ఎవరికీ చూపించలేక మానసికంగా బాగా కుంగిపోయిందని, తనకు డైపర్లు కూడా మార్చేవాడినని, తనకోసం నేను అంతగా శ్రమ పడటం చూడలేకపోయింది. దాన్ని తలచుకుని ఇంకా ఎక్కువ బాధపడేది. ఒకానొక దశలో బాధని తట్టుకోలేక ఎలాగైనా తనను చంపేయమని ఆరేడు వారాలు ప్రాధేయపడిందని, తప్పని పరిస్థితులలోనే అలా చేశానని కోర్టుకు తెలిపారు హంటర్.
వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు హంటర్ నరహంతకుడేమీ కాదని వ్యాఖ్యానించింది. కోర్టు తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత హంటర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మూడేళ్ళుగా జైలులో మగ్గిపోతున్న తన తండ్రి ఎట్టకేలకు బయటకు రానున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది హంటర్ కుమార్తె. జులై 27న హంటర్ నిర్దోషని తీర్పు వెలువడటమే తరువాయి అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ఆ రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు..
Comments
Please login to add a commentAdd a comment