‘బ్రెగ్జిట్’ ఫలితాలపై ఉత్కంఠ
రెఫరెండంపై కొద్ది గంటల్లో చారిత్రక తీర్పు
* ప్రతికూల వాతావరణంలోనూ భారీ పోలింగ్
* పోలింగ్ బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనకే అనుకూలమనే ప్రచారం
* యూకేలో వెయ్యికోట్ల బెట్టింగ్
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న చారిత్రక ‘బ్రెగ్జిట్’ (బ్రిటన్ ఎగ్జిట్-ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం) రెఫరెండంపై మరికొద్ది గంటల్లో ఫలితం రానుంది. ‘యురోపియన్ యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ ఉండాలా? వద్దా?’ అనే ప్రశ్నకు సమాధానం మరికొద్ది సేపట్లో రానుంది.
ఇరు వర్గాల మధ్య వాదనలు, ఓ ఎంపీ హత్య, నువ్వా నేనా అన్నట్లు ప్రచారం తర్వాత 28 దేశాల ఈయూ కూటమిలో బ్రిటన్ అస్థిత్వాన్ని నిర్ణయించేందుకు జరిగిన రెఫరెండంలో భారీసంఖ్యలో బ్రిటన్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందులో 12 లక్షలమంది భారతీయ బ్రిటన్లు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. భారీగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భార్య సమంతతో కలసి ఓటేశారు. ఈయూలో ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని కామెరాన్ మొదట్నుంచీ ప్రచారం చేస్తున్నారు. యూకే ప్రజలు ఈయూనుంచి విడిపోవాలని.. యూకేకు అసలైన స్వాతంత్య్రం తీసుకురావాలని ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రచారం చేశారు.
కలిసుండేందుకే స్వల్ప మొగ్గు?
ఎన్నిక సరళి ఆధారంగా రెఫరెండంపై ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించకూడదని యూకే ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రచారం నువ్వా-నేనా అన్నట్లుండటం వల్ల.. ఫలితాలు కూడా అలాగే ఉండొచ్చనే అంచనా. అయితే.. ఎన్నికల ప్రచారం, ప్రజల స్పందన ఆధారంగా ‘ద డైలీ టెలిగ్రాఫ్’, ‘టైమ్స్’ మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం 51 శాతం బ్రిటన్లు ఈయూతో కలిసుండాలని, 49 శాతం వద్దని అభిప్రాయపడ్డారు.
ప్రతికూల వాతావరణం కారణంగా ఓటింగ్ శాతం తగ్గితే.. విడిపోవాలనుకున్న డిమాండ్ గెలుస్తుందన్న ప్రచారంతో.. అనుకూల వర్గం భారీగా పోలింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయానికల్లా (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల్లోపు) రెఫరెండం ఫలితాలు వెల్లడవుతాయి. యూకే బూకీలు మాత్రం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది. 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. వెయ్యికోట్లు)పైనే బెట్టింగ్ జరిగినట్లు సమాచారం.
ఓటింగ్‌లో పెన్సిల్ వివాదం
రెఫరెండంలో ఓటింగ్ వెళ్లే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్న వర్గాలు.. తమ పెన్నును తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎవరు ఓటేసినా ఈయూలో ఉండాలనేందుకు మొగ్గుచూపుతున్నట్లుగా ఓటు పడేలా కుట్ర జరుగుతోందంటూ కొందరు పోస్టులు చేశారు.
ఓటింగ్ కేంద్రాల బయట పెన్సిల్స్ ఇస్తున్నారని.. దీనితో ఓటు వేస్తే.. కౌంటింగ్ సమయంలో చెరిపేసి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పెన్నుతో మళ్లీ మార్కు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై స్పందించిన యూకే ఎన్నికల కమిషన్.. ఓటర్లు తమవెంట పెన్నులు తెచ్చుకోవాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియతోపాటు కౌంటింగ్ పక్కాగా జరిగేలా పారదర్శకమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.