బడ్వైజర్ పేరు మారింది..!
అమెరికా.. ఈ పేరు వింటేనే చాలు, చాలామందికి ఒళ్లు పులకిస్తుంది. మనవాళ్లయితే ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోదామా, ఎప్పుడు మంచి సాఫ్ట్‌వేర్ కొలువు చేద్దామా అని చూస్తుంటారు. కానీ అదే అమెరికాను మనం చేత్తో పట్టుకోగలిగితే ఎలా ఉంటుంది? అవును.. ప్రముఖ బీరు బ్రాండు బడ్వైజర్.. తన పేరు మార్చుకుంది. అమెరికా అని పేరు పెట్టుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి తాగుబోతులు మరింత పండగ చేసుకునేలా తమ బీరు పేరు మారుస్తున్నామని, ఇక అమెరికాను చేత్తో పట్టుకుని తాగొచ్చని బడ్వైజర్ బీరు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం పేరు మార్చడమే కాదు, బీరు క్యాన్లు, బాటిళ్ల మీద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇతర బొమ్మలు ఉంటాయట. 'అమెరికా ద బ్యూటిఫుల్', 'ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్' లాంటి పాటల సాహిత్యం కూడా వాటి మీద ముద్రిస్తున్నారు. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్ వరకు కూడా కొనసాగిస్తారు. ఆన్‌హ్యూసర్- బష్ ఇన్‌బెవ్ అనే బెల్జియం కంపెనీ ఈ బడ్వైజర్ బీరుకు యజమాని.