అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు!
అమెరికాలో కాల్పులు జరిపి కలకలం సృష్టించిన సయ్యద్ రిజ్వాన్ ఫారూక్ (28), తష్ఫీన్ మాలిక్ (27) అనే ఇద్దరి గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న జంటేనని తాజాగా అక్కడి పోలీసు వర్గాలు నిర్ధారించాయి. చిన్నారిని ఇంట్లో వదిలేసి.. ఉగ్రవాద దాడికి బయల్దేరారు. తాము తిరిగొచ్చే అవకాశం లేదని వాళ్లకు తెలుసు. అయినా అన్నింటికీ తెగించి మరీ వెళ్లారు. వీళ్లలో రిజ్వాన్ ఫారూక్ అమెరికా పౌరుడు కాగా, అతడి భార్య తష్ఫీన్ శాశ్వత నివాస హోదా పొందింది. బుధవారం నాడు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో వీళ్లు 14 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. వీళ్లు ఉగ్రవాదులతో సోషల్ మీడియా ద్వారా సంభాషించినట్లు తెలిసినా, అసలు దాడుల వెనుక కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియరాలేదు.
తష్ఫీన్ గురించి ఆన్‌లైన్ డేటింగ్ సర్వీస్ ద్వారా తెలుసుకున్న ఫారూక్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడని అతడి కుటుంబ లాయర్ తెలిపారు. ఫారూక్ సౌదీ అరేబియా వెళ్లినప్పుడు ఆమెను కలుసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన తష్ఫీన్ తనకు 18-20 ఏళ్ల వయసుండగా సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. తర్వాత ఫారూక్‌ను పెళ్లి చేసుకుని ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందింది. ఆరు నెలల వయసున్న తమ కూతుర్ని ఫారూక్ తల్లి వద్ద వదిలేసి, డాక్టర్ దగ్గరకు వెళ్తున్నామంటూ వెళ్లి కాల్పులు జరిపారు. చివరకు కాల్పుల్లో ఈ దంపతులు కూడా మరణించిన విషయం ఫారూక్ తల్లికి తెలిసి ఆమె తల్లడిల్లిపోయారు. ఫారూక్ నిజానికి పర్యావరణ ఆరోగ్య నిపుణుడు.