Tashfeen Malik
-
ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: కాలిఫోర్నియా కాల్పుల నిందితురాలు తష్ఫీన్ మాలిక్ 2013లో భారత్ వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. సౌదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు తష్ఫీన్ భారత్‌ను సందర్శించిందని పేర్కొన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఆమె గురించి ఆరా తీశాయి. ఇందుకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, వీసా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పాకిస్థానీ మహిళ అయిన తష్ఫీన్కు చెందిన రెండు పాస్‌పోర్టుల (ఒకటి పాకిస్థాన్, మరొకటి రియాద్ జారీ చేశాయి) వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదు కాలేదని నిఘా అధికారులు బుధవారం నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తష్ఫీన్ భారత్ మీదుగా మరో దేశానికి వెళ్లి ఉంటుందని, అలాంటి సందర్భంలోనే ఆమె వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదుకావని ఓ అధికారి తెలిపారు. 'ఒక పాకిస్థాన్ పౌరుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నిఘా నేత్రం నుంచి తప్పించుకొని వెళ్లే వీలు లేదు. వారి విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆమె అసలే భారత్‌కు రాకపోయి ఉండొచ్చు. లేదా మరో దేశానికి వెళ్లేందుకు కనెక్టింగ్ విమానం ఎక్కేందుకు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు' అని ఆ అధికారి వివరించారు. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించి.. అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. -
భారత్‌పైనా ఆ మహిళా ఉగ్రవాది కన్ను!
న్యూయార్క్: కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో నిందితురాలైన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ (27) ఓసారి భారత్‌ను కూడా సందర్శించిందట. 2103లో ఆమె సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చి ఉంటుందని, ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించిన ఆమె అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 2008 జూన్‌లో తన తండ్రిని కలిసేందుకు తష్ఫీన్ మాలిక్ సౌదీ అరేబియా వచ్చిందని, ఆయనతోపాటు దాదాపు తొమ్మిది నెలలు గడిపి.. ఆ తర్వాత తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోయిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్సౌర్ తుర్కీ తెలిపారు. 2013 జూన్ 8న ఆమె మరోసారి పాక్ నుంచి సౌదీ వచ్చిందని, మళ్లీ అక్టోబర్ 6న సౌదీ నుంచి భారత్ వెళ్లిందని ఆయన తెలిపారు. అయితే ఆమె భారత్ వస్తే ఎక్కడుంది? ఎన్ని రోజులపాటు గడిపిందనే వివరాలు ఆ కథనంలో వెల్లడించలేదు. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. మహిళ ఉగ్రవాదిగా భావిస్తున్న తష్ఫీన్ భారత్ వస్తే.. ఇక్కడ ఆమె లక్ష్యమేమిటి? భారత్‌పైనా దాడులకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? అన్న అంశాన్ని తాజా కథనంలో నేపథ్యంలో భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. -
పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది
ముల్తాన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడిన పాకిస్థానీ మహిళా ఉగ్రవాది తష్ఫీన్ మాలిక్.. గతంలో పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో గల ఓ మదర్సాకు వెళ్లి, అక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. మహిళలకు ఖురాన్ గురించి అవగాహన కల్పించే అల్- హుదా మదర్సాలో తష్ఫిన్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో తష్ఫిన్ కోర్సును పూర్తి చేయకుండా మధ్యలోనే మానేసినట్లు మదర్సా సిబ్బంది విచారణ అధికారులకు తెలిపారు. అల్- హుదా మదర్సా అమెరికాతో పాటు పలు దేశాల్లో శాఖలను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థ తాలిబాన్ బావజాలాన్ని వ్యాప్తి చేస్తుందనే విమర్శలు ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు లేవు. తాజా సమాచారంతో సంస్థ కార్యకలాపాలను నిఘా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. -
ఆమె చర్యకు సిగ్గుపడుతున్నాం!
కరొర్ లాల్ ఎసాన్ (పాకిస్థాన్): కాలిఫోర్నియాలో కాల్పులతో మారణహోమం సృష్టించిన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ చర్య పట్ల ఆమె దూరపు బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చర్య తమను సిగ్గుపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తష్ఫీన్ మాలిక్ లో చిన్నప్పటి నుంచి మతఛాందస ఛాయలు కనిపించేవని, ఆమె ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందని తాము అనుకోలేదని ఆమె క్లాస్ మెట్లు, టీచర్లు చెప్తున్నారు. తష్పీన్ మాలిక్ (28), ఆమె భర్త సయెద్ ఫరుక్ (28) అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ సోషల్ సర్వీసు కేంద్రంపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. వారిని ఖలిఫత్ స్వయం ప్రకటిత సైనికులుగా పేర్కొన్న ఐఎస్ఐఎస్.. వారి చర్యపై ప్రశంసలు కురిపించింది. పాకిస్థాన్ లోని తష్పీన్ దూరపు బంధువులు మాత్రం ఈ ఘటనపై షాక్ వ్యక్తం చేశారు. ఆమె మేనమామ, మాజీ రాష్ట్ర మంత్రి మాలిక్ అహ్మద్ అలి ఔలాఖ్ మాట్లాడుతూ పాక్ సెంట్రల్ పంజాబ్ ప్రావిన్సులోని కరార్ లాల్ ఎసాన్ ప్రాంతానికి చెందిన తష్పీన్ కుటుంబం 1989లో సౌదీ అరేబియా వెళ్లిందని, తష్ఫీన్ తండ్రి గుల్జార్ మాలిక్ ఒక ఇంజినీర్ అని, తమ కుటుంబంలో సన్నిహిత బంధువుల పెళ్లిలు జరిగినా.. ఆయన ఎప్పుడు సౌదీ నుంచి తిరిగి రాలేదని తెలిపాడు. 'మా మేనకోడలు చేసిన చర్య గురించి విని షాక్ తిన్నాం. సిగ్గుపడ్డాం. అంతా దారుణానికి పాల్పడాల్సిన అవసరమేముంది? మేం నమ్మలేకపోతున్నాం' అని ఆయన ఓ వార్తాసంస్థకు తెలిపారు. -
అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు!
అమెరికాలో కాల్పులు జరిపి కలకలం సృష్టించిన సయ్యద్ రిజ్వాన్ ఫారూక్ (28), తష్ఫీన్ మాలిక్ (27) అనే ఇద్దరి గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న జంటేనని తాజాగా అక్కడి పోలీసు వర్గాలు నిర్ధారించాయి. చిన్నారిని ఇంట్లో వదిలేసి.. ఉగ్రవాద దాడికి బయల్దేరారు. తాము తిరిగొచ్చే అవకాశం లేదని వాళ్లకు తెలుసు. అయినా అన్నింటికీ తెగించి మరీ వెళ్లారు. వీళ్లలో రిజ్వాన్ ఫారూక్ అమెరికా పౌరుడు కాగా, అతడి భార్య తష్ఫీన్ శాశ్వత నివాస హోదా పొందింది. బుధవారం నాడు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో వీళ్లు 14 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. వీళ్లు ఉగ్రవాదులతో సోషల్ మీడియా ద్వారా సంభాషించినట్లు తెలిసినా, అసలు దాడుల వెనుక కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియరాలేదు. తష్ఫీన్ గురించి ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ద్వారా తెలుసుకున్న ఫారూక్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడని అతడి కుటుంబ లాయర్ తెలిపారు. ఫారూక్ సౌదీ అరేబియా వెళ్లినప్పుడు ఆమెను కలుసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన తష్ఫీన్ తనకు 18-20 ఏళ్ల వయసుండగా సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. తర్వాత ఫారూక్‌ను పెళ్లి చేసుకుని ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందింది. ఆరు నెలల వయసున్న తమ కూతుర్ని ఫారూక్ తల్లి వద్ద వదిలేసి, డాక్టర్ దగ్గరకు వెళ్తున్నామంటూ వెళ్లి కాల్పులు జరిపారు. చివరకు కాల్పుల్లో ఈ దంపతులు కూడా మరణించిన విషయం ఫారూక్ తల్లికి తెలిసి ఆమె తల్లడిల్లిపోయారు. ఫారూక్ నిజానికి పర్యావరణ ఆరోగ్య నిపుణుడు.