భారత్‌పైనా ఆ మహిళా ఉగ్రవాది కన్ను!
న్యూయార్క్: కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో నిందితురాలైన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ (27) ఓసారి భారత్‌ను కూడా సందర్శించిందట. 2103లో ఆమె సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చి ఉంటుందని, ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించిన ఆమె అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఓ కథనం ప్రచురించింది.
2008 జూన్‌లో తన తండ్రిని కలిసేందుకు తష్ఫీన్ మాలిక్ సౌదీ అరేబియా వచ్చిందని, ఆయనతోపాటు దాదాపు తొమ్మిది నెలలు గడిపి.. ఆ తర్వాత తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోయిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్‌సౌర్ తుర్కీ తెలిపారు. 2013 జూన్ 8న ఆమె మరోసారి పాక్ నుంచి సౌదీ వచ్చిందని, మళ్లీ అక్టోబర్ 6న సౌదీ నుంచి భారత్ వెళ్లిందని ఆయన తెలిపారు. అయితే ఆమె భారత్ వస్తే ఎక్కడుంది? ఎన్ని రోజులపాటు గడిపిందనే వివరాలు ఆ కథనంలో వెల్లడించలేదు.
తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. మహిళ ఉగ్రవాదిగా భావిస్తున్న తష్ఫీన్ భారత్ వస్తే.. ఇక్కడ ఆమె లక్ష్యమేమిటి? భారత్‌పైనా దాడులకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? అన్న అంశాన్ని తాజా కథనంలో నేపథ్యంలో భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.