Syed Rizwan Farook
-
ఆపిల్ సహాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్
కాలిఫోర్నియా: శాన్ బెర్నార్డినోలో కాల్పులు జరిపి 14 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్‌ను ఆపిల్ కంపెనీ సహాయం లేకుండానే అమెరికా ఎఫ్‌బీఐ అన్‌లాక్ చేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఐలీన్ డెక్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. దీంతో ఈ విషయంలో గత కొంతకాలంగా ఆపిల్ కంపెనీతో కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్లేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శాన్ బెర్నార్డినో కాల్పుల అనంతరం జరిగిన ఓ ఎన్కౌంటర్లో రిజ్వాన్ ఫరూక్ చనిపోవడం, అయన వద్ద ఐఫోన్ లభించడం, ఆ ఫోన్లో ఉన్న డేటాను తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ వర్గాలు ఆపిల్ కంపెనీ సహాయాన్ని అర్థించడం, అందుకు కంపెనీ నిరాకరించడంతో ఎఫ్‌బీఐ కోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించడం, ఆ కంపెనీకి గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు అండగా నిలబడడం తదితర పరిణామాలు తెల్సినవే. ఎఫ్‌బీఐ థర్డ్ పార్టీ సహాయంతో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయించిన విషయం తెలిసిందో ఏమో గానీ ఆపిల్ కంపెనీ కూడా చివరకు ఎఫ్‌బీఐకి సహకరించేందుకు అంగీకరించింది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇస్తామని సోమవారమే ప్రకటించింది. ఐఫోన్‌నే కాకుండా ఏ ఫోన్నునైనా అన్‌లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ సహకారం తమకు ఉందని, ఈ విషయంలో ఆపిల్ కంపెనీ సహాయ సహకారాలు తమకు అవసరం లేదని డెక్కర్ వివరించారు. అయితే ఆ థర్డ్ పార్టీ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'సెలెబ్రైట్'కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఐఫోన్‌ను అన్‌లాక్ చేసినట్లు ఓ ఇజ్రాయెల్ వార్తాపత్రిక తెలిపింది. ఈ కేసులో తాము ఎఫ్‌బీఐకి సహకరించినట్లు సెలెబ్రైట్ అంగీకరించింది. అయితే ఎలాంటి సహాయం చేసిందనే వివరాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. -
ఆమె భారత్‌కు రాలేదు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: కాలిఫోర్నియా కాల్పుల నిందితురాలు తష్ఫీన్ మాలిక్ 2013లో భారత్ వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. సౌదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు తష్ఫీన్ భారత్‌ను సందర్శించిందని పేర్కొన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఆమె గురించి ఆరా తీశాయి. ఇందుకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, వీసా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పాకిస్థానీ మహిళ అయిన తష్ఫీన్కు చెందిన రెండు పాస్‌పోర్టుల (ఒకటి పాకిస్థాన్, మరొకటి రియాద్ జారీ చేశాయి) వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదు కాలేదని నిఘా అధికారులు బుధవారం నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తష్ఫీన్ భారత్ మీదుగా మరో దేశానికి వెళ్లి ఉంటుందని, అలాంటి సందర్భంలోనే ఆమె వివరాలు ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో నమోదుకావని ఓ అధికారి తెలిపారు. 'ఒక పాకిస్థాన్ పౌరుడు ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నిఘా నేత్రం నుంచి తప్పించుకొని వెళ్లే వీలు లేదు. వారి విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆమె అసలే భారత్‌కు రాకపోయి ఉండొచ్చు. లేదా మరో దేశానికి వెళ్లేందుకు కనెక్టింగ్ విమానం ఎక్కేందుకు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు' అని ఆ అధికారి వివరించారు. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించి.. అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. -
భారత్‌పైనా ఆ మహిళా ఉగ్రవాది కన్ను!
న్యూయార్క్: కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో నిందితురాలైన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ (27) ఓసారి భారత్‌ను కూడా సందర్శించిందట. 2103లో ఆమె సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చి ఉంటుందని, ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. తష్ఫీన్ మాలిక్ రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లిందని, ఆ తర్వాత ఓసారి బ్రిటన్‌లో పర్యటించిన ఆమె అనంతరం భారత్ వెళ్లిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఓ కథనం ప్రచురించింది. 2008 జూన్‌లో తన తండ్రిని కలిసేందుకు తష్ఫీన్ మాలిక్ సౌదీ అరేబియా వచ్చిందని, ఆయనతోపాటు దాదాపు తొమ్మిది నెలలు గడిపి.. ఆ తర్వాత తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోయిందని సౌదీ హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్సౌర్ తుర్కీ తెలిపారు. 2013 జూన్ 8న ఆమె మరోసారి పాక్ నుంచి సౌదీ వచ్చిందని, మళ్లీ అక్టోబర్ 6న సౌదీ నుంచి భారత్ వెళ్లిందని ఆయన తెలిపారు. అయితే ఆమె భారత్ వస్తే ఎక్కడుంది? ఎన్ని రోజులపాటు గడిపిందనే వివరాలు ఆ కథనంలో వెల్లడించలేదు. తష్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయెద్ రిజ్వాన్ ఫరుక్ గతవారం కాలిఫోర్నియాలో కాల్పులతో విరుచుకుపడి 14మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసులు కాల్పులకు ప్రేరేపణ ఏమిటి అన్న అంశాన్ని శోధిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మహిళ అయిన తష్ఫీన్ నేపథ్యం, ఆమె గత జీవితాన్ని క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. మహిళ ఉగ్రవాదిగా భావిస్తున్న తష్ఫీన్ భారత్ వస్తే.. ఇక్కడ ఆమె లక్ష్యమేమిటి? భారత్‌పైనా దాడులకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? అన్న అంశాన్ని తాజా కథనంలో నేపథ్యంలో భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. -
అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు!
అమెరికాలో కాల్పులు జరిపి కలకలం సృష్టించిన సయ్యద్ రిజ్వాన్ ఫారూక్ (28), తష్ఫీన్ మాలిక్ (27) అనే ఇద్దరి గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న జంటేనని తాజాగా అక్కడి పోలీసు వర్గాలు నిర్ధారించాయి. చిన్నారిని ఇంట్లో వదిలేసి.. ఉగ్రవాద దాడికి బయల్దేరారు. తాము తిరిగొచ్చే అవకాశం లేదని వాళ్లకు తెలుసు. అయినా అన్నింటికీ తెగించి మరీ వెళ్లారు. వీళ్లలో రిజ్వాన్ ఫారూక్ అమెరికా పౌరుడు కాగా, అతడి భార్య తష్ఫీన్ శాశ్వత నివాస హోదా పొందింది. బుధవారం నాడు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో వీళ్లు 14 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. వీళ్లు ఉగ్రవాదులతో సోషల్ మీడియా ద్వారా సంభాషించినట్లు తెలిసినా, అసలు దాడుల వెనుక కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియరాలేదు. తష్ఫీన్ గురించి ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ద్వారా తెలుసుకున్న ఫారూక్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడని అతడి కుటుంబ లాయర్ తెలిపారు. ఫారూక్ సౌదీ అరేబియా వెళ్లినప్పుడు ఆమెను కలుసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన తష్ఫీన్ తనకు 18-20 ఏళ్ల వయసుండగా సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. తర్వాత ఫారూక్‌ను పెళ్లి చేసుకుని ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందింది. ఆరు నెలల వయసున్న తమ కూతుర్ని ఫారూక్ తల్లి వద్ద వదిలేసి, డాక్టర్ దగ్గరకు వెళ్తున్నామంటూ వెళ్లి కాల్పులు జరిపారు. చివరకు కాల్పుల్లో ఈ దంపతులు కూడా మరణించిన విషయం ఫారూక్ తల్లికి తెలిసి ఆమె తల్లడిల్లిపోయారు. ఫారూక్ నిజానికి పర్యావరణ ఆరోగ్య నిపుణుడు.