ఆమె చర్యకు సిగ్గుపడుతున్నాం!
కరొర్ లాల్ ఎసాన్ (పాకిస్థాన్): కాలిఫోర్నియాలో కాల్పులతో మారణహోమం సృష్టించిన పాకిస్థానీ మహిళ తష్ఫీన్ మాలిక్ చర్య పట్ల ఆమె దూరపు బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చర్య తమను సిగ్గుపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తష్ఫీన్ మాలిక్ లో చిన్నప్పటి నుంచి మతఛాందస ఛాయలు కనిపించేవని, ఆమె ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందని తాము అనుకోలేదని ఆమె క్లాస్ మెట్లు, టీచర్లు చెప్తున్నారు.
తష్పీన్ మాలిక్ (28), ఆమె భర్త సయెద్ ఫరుక్ (28) అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ సోషల్ సర్వీసు కేంద్రంపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. వారిని ఖలిఫత్ స్వయం ప్రకటిత సైనికులుగా పేర్కొన్న ఐఎస్ఐఎస్.. వారి చర్యపై ప్రశంసలు కురిపించింది.
పాకిస్థాన్ లోని తష్పీన్ దూరపు బంధువులు మాత్రం ఈ ఘటనపై షాక్ వ్యక్తం చేశారు. ఆమె మేనమామ, మాజీ రాష్ట్ర మంత్రి మాలిక్ అహ్మద్ అలి ఔలాఖ్ మాట్లాడుతూ పాక్ సెంట్రల్ పంజాబ్ ప్రావిన్సులోని కరార్ లాల్ ఎసాన్ ప్రాంతానికి చెందిన తష్పీన్ కుటుంబం 1989లో సౌదీ అరేబియా వెళ్లిందని, తష్ఫీన్ తండ్రి గుల్జార్ మాలిక్ ఒక ఇంజినీర్ అని, తమ కుటుంబంలో సన్నిహిత బంధువుల పెళ్లిలు జరిగినా.. ఆయన ఎప్పుడు సౌదీ నుంచి తిరిగి రాలేదని తెలిపాడు. 'మా మేనకోడలు చేసిన చర్య గురించి విని షాక్ తిన్నాం. సిగ్గుపడ్డాం. అంతా దారుణానికి పాల్పడాల్సిన అవసరమేముంది? మేం నమ్మలేకపోతున్నాం' అని ఆయన ఓ వార్తాసంస్థకు తెలిపారు.