లవ్ అనేది నాలుగక్షరాల ఆంగ్ల పదమే కాదు.. ఇది సర్వమానవ ప్రేమలకు చిహ్నం.. ప్రపంచాన్నంత కట్టిపడేసేంత శక్తి ఈ పదానికి ఉంది. అయితే, ఇది ఇప్పుడు మనీ అనే ఐదక్షరాల పదంతో తీవ్రంగా పోటీపడాల్సి వస్తుందని, యుద్ధం చేయాల్సి వస్తుందని అంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. ఈ పోటీలో డబ్బుపై ప్రేమ అనేకసార్లు ఓడిపోతుందట.. గాయపడుతుందంట.
వివాహం చేసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమను చాలామంది భార్యభర్తలు ఎక్కువకాలం కొనసాగించలేక పోతున్నారని వారంటున్నారు. అందుకు ప్రధాన కారణం వారి మధ్య ఆర్థికపరమైన విషయాలు చర్చకు రావడమేనంటున్నారు. దీంతో పవిత్రమైన వైవాహిక జీవితాన్ని, వారిమధ్య ఉన్న అమూల్యమైన ప్రేమను కూడా మర్చిపోయి వెంటనే విడాకులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన అధ్యయనంలో ఎన్నో జంటలు డబ్బు సృష్టించిన సమస్యల వల్లే విడాకులు పొందినట్లు తేల్చింది.