మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై వేగంగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఘటనలో 19 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో కశ్మీర్‌కు చెందిన రాహుల్‌కౌల్ అనే భారతీయుడు గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తితో పాటు పక్కనున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని, ఉగ్రదాడి కాదని వారు పేర్కొన్నారు. ఓ తెలుపు రంగు సుజుకీ ఎస్‌యూవీ కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిందని, అయితే రెడ్ సిగ్నల్ ఉండగానే ముందుకు దూసుకెళ్లిందని, దీంతో రోడ్డు దాటుతున్న పాదచారులు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పాదచారులపైకి కారు దూసుకురావడంతో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొందని, ప్రజలు కేకలు వేస్తూ అటూఇటూ పరుగులు పెట్టారన్నారు. ప్రమాదంలో ఓ చిన్నారి తలకు తీవ్రంగా గాయమైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తనకు అందిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో మెల్‌బోర్న్‌లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్ వద్ద పాదచారులపైకి కారు దూసుకెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment