పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తే పేరెంట్స్‌కు జైలే..
పారిస్: సోషల్ మీడియాలో యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తూ బ్రిటన్ లాంటి దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తుంటే, సోషల్ మీడియాలో పిల్లల ప్రైవసీని పరిరక్షించేందుకు ఫ్రాన్స్ కొత్త చట్టాలను తీసుకొస్తోంది. పిల్లల అనుమతి లేకుండా వారి ఫోటోలనుగానీ, వారి వివరాలనుగానీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తల్లిదండ్రులను శిక్షించేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ముందస్తు అనుమతి లేకుండా మైనర్ల ఫొటోలను, వివరాలను పోస్ట్ చేసినా శిక్షార్హమైన నేరమే. ఈ నేరం కింద ఏడాది పాటు జైలు, 35 లక్షల రూపాయల వరకు నష్ట పరిహారం కింద జరిమానా విధిస్తారు.
ఈ కొత్త చట్టం ప్రకారం పిల్లలు, వారు పిల్లలగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా దావా వేయాల్సిన అవసరం లేదు. పెద్దయ్యాక కూడా వేయవచ్చు. అనవసరంగా తమ తల్లిదండ్రులు తమ ఫోటోలను, వివరాలను సోషల్ మీడియాలో తమ అనుమతి లేకుండా పోస్ట్ చేశారని జీవితంలో ఎవరు, ఎప్పుడు భావించినా తల్లిదండ్రులపై దావా వేయవచ్చు. మిచిగాన్ యూనివర్శిటీ సోషల్ మీడియా చైతన్యంపై జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 51 శాతం తల్లిదండ్రులు పిల్లల అనుమతి లేకుండా తమ పిల్లల ఫొటోలను, వివరాలను పోస్ట్ చేస్తున్నారు.
యాభై శాతం పైగా త ల్లులు, మూడోవంతు మంది తండ్రులు తమ పిల్లల ఫొటోల పోస్ట్‌చేసి వారి ఆరోగ్య విషయాలను, వారిని తాము ఎలా పోషిస్తున్నామన్న విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను చర్చించడం వల్ల తాము ఒంటరితనానికి దూరమవుతున్నామని వారిలో ఎక్కువ మంది సమర్థించుకుంటున్నారు. కానీ ఇలా చేయడం పిల్లల ప్రైవసీ హక్కులను కాలరాయడమేనని ఫ్రెంచ్ ప్రభుత్వం భావిస్తోంది.