పిల్లల ఫొటోలు పెడితే జైలుకు!
ప్యారిస్: ‘క్యూట్’గా ఉందనో... ‘స్వీటీ’ సూపరనో పిల్లల్ని చూసి మురిసి... ఆ సంబరాన్ని ‘సామాజిక మాధ్యమంలో’ అందరితో పంచుకొందామనుకొంటే ఇక కుదరదు! లెక్కకు మించిన ‘లైక్’లు... ‘లవ్లీ’ కామెంట్ల మాటెలా ఉన్నా... పిల్లల ఫొటోలను పోస్టు చేస్తే వారి తల్లిదండ్రులు ఊచలు లెక్కించక తప్పదు! నమ్మలేకపోతున్నా... ఇది నిజం. మైనర్ల అనుమతి లేకుండా వారి ఫొటోలు, వివరాలు షేర్ చేస్తే తల్లిదండ్రులకు ఏడాది జైలు, రూ.35 లక్షల జరిమానా విధిస్తారు. భయపడకండి. ఇది భారత్‌లో కాదు... ఫ్రాన్స్‌లో! సోషల్ మీడియాలో యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తూ బ్రిటన్ వంటి దేశాలు అడుగులేస్తుంటే...
చిన్నారులకు భద్రత కల్పించేలా ఫ్రాన్స్ ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. దీని ప్రకారం తమ అనుమతి లేకుండా తల్లిదండ్రులు ఫొటోలు, వివరాలు పోస్టు చేస్తే... అప్పటికప్పుడే కాకపోయినా జీవితంలో ఎప్పుడైనా వారిపై కేసు వేయవచ్చు. మిచిగాన్ విశ్వవిద్యాలయం సోషల్ మీడియా చైతన్యంపై జరిపిన అధ్యయనం ప్రకారం 51 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల అనుమతి లేకుండా వారి ఫొటోలు పోస్టు చేస్తున్నారు.