చైనాలో భారీగా కరోనా పరీక్షలు | China begins mass testing in Beijing as 67 new cases appear | Sakshi
Sakshi News home page

చైనాలో భారీగా కరోనా పరీక్షలు

Published Tue, Jun 16 2020 5:25 AM | Last Updated on Tue, Jun 16 2020 8:01 AM

China begins mass testing in Beijing as 67 new cases appear - Sakshi

బీజింగ్‌: కరోనా మహమ్మారి మరోసారి తన కోరలు చాచడంతో చైనా అప్రమత్తమైంది. కొత్త కరోనా కేసులు మొదలైన బీజింగ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు ఇటీవల వెళ్లిన వారందరికీ కరోనా పరీక్షలు చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 67 మందికి కరోనా సోకగా, ఇందులో 42 మంది రాజధాని బీజింగ్‌కు చెందిన వారే. ఇప్పటివరకూ చైనాలో మొత్తంగా 83181 మందికి కరోనా సోకగా, 4,634 మంది మరణించారు.

కొన్ని వారాలపాటు కొత్త కేసులేవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న చైనా.. తాజాగా కేసులు నమోదవడంతో వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా మే 30 నుంచి బీజింగ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళ్లిన 29,386 మందికి సోమవారం నుంచి పరీక్షలు చేయడం మొదలుపెట్టిందని బీజింగ్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రతినిధి గావ్‌ షియాజున్‌ తెలిపారు.

‘కరోనా టీకా’కు మరింత దగ్గరయ్యాం
కోవిడ్‌–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్‌ బయోటెక్‌ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్‌’టీకా మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి దశలో 600 మంది వాలంటీర్లు తమ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 90% కన్నా ఎక్కువ మందిలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. వారిలో తీవ్రస్థాయి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవీ కనిపించలేదని పేర్కొంది.

త్వరలో చైనా ‘నేషనల్‌ మెడికల్‌ ప్రాడక్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌’కు పూర్తి వివరాలు అందజేస్తామని, అనంతరం, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విదేశాల్లో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. బ్రెజిల్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూటొ బూటాంటన్‌’సంస్థతో కలిసి విదేశాల్లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామంది. ‘తొలి, మలి క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో కోవిడ్‌–19పై పోరులో కీలక దశకు చేరుకున్నాం. కరోనావాక్‌ సురక్షితమైందని మా ట్రయల్స్‌లో తేలింది’అని సైనోవాక్‌ ప్రెసిడెంట్, సీఈఓ వీడాంగ్‌ యిన్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement