బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్....
లండన్ : నాలుకతో ముక్కును పట్టుకోగలరా...అబ్బా.. ఇది పాతేదేగా అనుకుంటున్నారా. అయితే మీ చేతిని వెనకనుంచి ముందుకు తీసుకొచ్చి మీ బొడ్డును ముట్టుకోగలరా.. దీన్నే బెల్లీ బటన్ ఛాలెంజ్ అంటారు. అపుడే ట్రై చేసేస్తున్నారా.. ఆగండాగండి.
ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ లాగానే బెల్లీ బటన్ ఛాలెంజ్ ఇపుడు చైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తుపాను సృష్టిస్తోంది. ఇప్పటికే చైనాలో వేలమంది నెటిజన్లు ఈ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారట. ఈ బెల్లీ బటన్ టచింగ్ కోసం నానా తంటలూ పడుతున్నారట. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఈ విషయంలో తెగ పోటీపడుతున్నారని బీబీసీ రిపో్ర్టుచేసింది. ఒక్కరోజులోనే కోటి 30 లక్షల మంది చైనా వెబ్సైట్ 'వైబో'ను వీక్షించారని, దాదాపు 1,04,000కు పైగా చర్చలు జరిగాయని తెలిపింది. కొంతమంది పురుషులు గంటలకు గంటలు కష్టపడి మరీ ఈ ఫీట్ను సాధించారట. దీనికి సంబంధించిన ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయడంతో లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి.
మరోవైపు ఇలా చేయగలిగిన మహిళలు నాజూగ్గా ఉన్నట్టనీ, మిగతావాళ్లు బరువు తగ్గాల్సిందే అని అమెరికా శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఇదంతా బోగస్ అని నిపుణులు అంటున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా అందుకోగలిగితేనే మీరు సన్నగా నాజాగ్గా ఉన్నట్టనే అభిప్రాయం ప్రచారం కావడంతో నిపుణులు మండిపడుతున్నారు. నడుం సైజు, చేతుల పొడవు, సాధన మీద ఇది ఆధారపడుతుందని, ఇలా చేయలేకపోయినంత మాత్రాన గందరగోళపడాల్సిన అవసరం లేదంటున్నారు. ముఖ్యంగా మహిళలు, పొట్ట కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.