చైనా ఖండన.. భారత్ దౌత్యపరమైన విజయం
చైనా ఖండన.. భారత్ దౌత్యపరమైన విజయం
Published Tue, Sep 5 2017 8:42 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావిస్తూ బ్రిక్స్‌సమావేశంలో ఉగ్ర వ్యతిరేక సంయుక్త డిక్లరేషన్ చేయటం తెలిసిందే. ముఖ్యంగా చైనా అండతో రెచ్చిపోతున్న పాక్‌కు ఇది ఊహించని శరాఘతమే. అయితే ఇది ముమ్మాటికీ భారత్ సాధించిన విజయమేనని సీనియర్ మాజీ సైన్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.
‘బ్రిక్స్ సమావేశంలో టెర్రరిజం అంశంను ప్రస్తావనకు తేవటం, దానిని ప్రధాన ఏజెండాగా మార్చి చర్చించటంలో మోదీ విజయం సాధించారు. మిగతా దేశాలు కూడా ఉగ్రవాదంతో కలిగే ముప్పును గుర్తించాయి. పాక్‌కు సంబంధించిన ఉగ్రవాద సంస్థల పేర్లు కూడా తెరపైకి రావటం ప్రధానాంశమనే చెప్పొచ్చు. ఆ ఘనత అంతా ప్రధాని మోదీ ఖాతాలోకే వెళ్తుంది’ అని సైన్య నిపుణులు ఖమర్ ఆఘా వ్యాఖ్యానించారు.
ఇక మాజీ సైన్యాధికారి పీకే సెహగల్ కూడా ఇది ఇండియా సాధించిన దౌత్యపరమైన విజయమని అభివర్ణించారు. ‘బ్రిక్స్ సదస్సులో చైనా పాక్ ఉగ్రచర్యలను ఖండించింది. మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న చైనా ప్రవర్తనలో మార్పు మొదలైంది. పాక్ చర్యలను ఖండిస్తూ ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్ధతునిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న చైనా తన పంథాను మార్చుకుని తామూ ఉగ్రవాదానికి(పాక్‌తో సహా) వ్యతిరేకమని ప్రకటించింది’ అని సెహగల్ తెలిపారు.
ఇక రాజకీయాలకతీతంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై హర్షం వ్యక్తం చేశాయి. డిక్లరేషన్ మీద ఐదు దేశాలు సంతకం చేయగలిగితే.. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను మరోసారి దోషిగా నిలబెట్టే అవకాశం భారత్‌కు దక్కుతుందని సీనియర్ నేత మీమ్ అఫ్జల్ చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement