చైనాలో భారీ భూకంపం
175 మంది మృతి; 1,400 మందికి గాయాలు
బీజింగ్: చైనాలో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రతతో నైరుతి చైనాలోని యునాన్ రాష్ట్రాన్ని కుదిపేసింది. లూడియన్ కౌంటీలో జూవోతాంగ్ నగరానికి 23 కి.మీ.ల దూరంలోని లాంగ్‌తౌషన్ పట్టణం కేంద్రంగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు(బీజింగ్ కాలమానం) సంభవించిన ఈ భారీ భూకంపంలో 175 మంది మరణించగా, దాదాపు 1,400 మంది గాయపడ్డారు. 181 మంది జాడ తెలియడం లేదు. భూకంప తీవ్రతకు 12 వేల గృహాలు కుప్పకూలిపోగా, 30 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికం, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. భూకంపం ధాటికి క్వివోజియా కౌంటీలో 30 మంది మరణించారు. లాంగ్‌తౌషన్ సహా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
లాంగ్‌తౌషన్‌కు వెళ్లే మార్గంలో కొండచరియ విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగి, సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. మరోవైపు జూవోతాంగ్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలు సహాయక చర్యలను ఆటంకపరిచే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూవోతాంగ్ నగరం భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో ఉంది. ఇక్కడే రిక్టర్ స్కేల్‌పై 7.1 పాయింట్ల తీవ్రతతో 1974లో సంభవించిన భూకంపంలో 1,400 మంది చనిపోగా, 2012లో వచ్చిన మరో భూకంపంలో 80 మంది మరణించారు. కాగా, భారత్, నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్ ప్రాంతంలోనూ ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది.