బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన ముగ్గురు విలేకరులను చైనా ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఫిబ్రవరి 3 వ తేదీన ప్రచురితమైన ఒపీనియన్ పీస్‌లో చైనాను ‘ఆసియా ఖండపు నిజమైన రోగి’గా అభివర్ణిస్తూ వాల్‌స్ట్రీట్ శీర్షిక పెట్టింది. దీనిపై చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శీర్షిక’పై స్పందించిన చైనా విదేశాంగ శాఖ వాల్‌స్ట్రీట్ బ్యూరో చీఫ్ జోష్ చిన్, రిపోర్టర్ చావో డెంగ్‌ను దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. వీరిరువురు అమెరికా పౌరులు కాగా వీరితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన రిపోర్టర్ ఫిలిఫ్ వెన్‌ను కూడా 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
ఈ విషయం గురించి చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జన్‌షాంగ్ మాట్లాడుతూ.. వాల్‌స్ట్రీట్ పత్రిక వివక్షను చూపుతూ అలాంటి శీర్షికను పెట్టిందని, బాధ్యతరహితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. చైనా ప్రజలు ఈ విషయాన్ని హర్షంచడంలేదని, దీనిని చైనాపై చేస్తున్న దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన వాల్‌స్ట్రీట్ సీఈఓ మాట్లాడుతూ అభిప్రాయాన్ని తెలిపే సిబ్బంది, వార్తలు అందించే సిబ్బంది వేరుగా ఉంటారని తెలిపారు. ఆ వార్తతో జర్నలిస్టులకు సంబంధం లేదని వారి బహిష్కరించడం విచారకరమన్నారు. దీనిపై మరోసారి పునరాలోచించాల్సిందిగా విదేశాంగశాఖ మంత్రిని అభ్యర్ధించనున్నట్లు తెలిపారు.
ఇక కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా చైనాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త రాయడం పట్ల ఆ దేశ ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఒకేసారి ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment