బీజింగ్ః చైనాను వర్షాల ముప్పు వదలడం లేదు. మళ్ళీ వానలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్రమైన గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ.. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా ఎడ తెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ చైనా ప్రాంతం అతలాకుతలమౌతోంది. కాస్త తెరపి ఇచ్చిందనుకునే లోపే మళ్ళీ వర్షాలు మొదలవ్వడంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ చైనాల్లో గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. గుయ్జౌ గువాంగ్జి, హునాన్, జియాంగ్జి, జెజియాంగ్, పుజియాన్, హెబీ, హెనాన్, యున్నాన్ ప్రాంతాల్లో.. రాగల 24 గంటల్లో తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం థాటికి మట్టి కరిగిపోవడం, కొండచరియలు విరిగి పడటం, వరద నీరు ఊళ్ళను ముంచెత్తడం వంటి అనేక ప్రమాదాలతోపాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్ళనుంచీ బయటకు రావద్దని సూచించిన అధికారులు, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
చైనాలో ఎరుపు, నారింజ, పసుపు, నీలం వంటి నాలుగు రంగులతో వాతావరణ హెచ్చరికల వ్యవస్థ అమల్లో ఉంది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రెడ్ (ఎరుపు) అలర్ట్ ఇస్తారు. ఆ తర్వాత స్థాయిని బట్టి ఆరెంజ్, ఎల్లో, బ్లూ వంటి హెచ్చరికలు జారీ చేస్తారు. బుధవారం నాటికి కురిసిన కుండపోత వర్షాలకు చైనాలో ఇప్పటికే 237 మంది చనిపోగా, 93 మంది వరకూ కనిపించకుండా పోయారు. వర్షాలు, వరదలకు వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది.
మళ్ళీ చైనాకు వర్షాల ముప్పు!
Published Sat, Jul 16 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement