కార్డు అక్కర్లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు!
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఒకప్పుడు బ్రాంచికి వెళ్లి, అక్కడ పొడవాటి క్యూలో నిల్చుని తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఏటీఎంలు వచ్చి బ్యాంకింగ్ రూపురేఖల్నే మార్చేశాయి. అయితే.. ఏటీఎం కార్డును ఎవరైనా దొంగిలిస్తే మాత్రం కాస్త కష్టంగానే ఉంటోంది. ఇప్పుడు ఈ కష్టాలకు కూడా చెక్ పెట్టేస్తున్నారు. కార్డులు జేబులో పెట్టుకోనవసరం లేదని.. అసలు కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి, మన ముఖాన్నే ఏటీఎం కార్డులా వాడుకుని డబ్బులు ఇస్తారట.
ఆఫీసులో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ టెక్నాలజీలో ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దాన్నే కొంచెం మార్చి.. ముఖాన్ని గుర్తించి, ఒక పాస్‌వర్డ్ అడిగి.. దాన్ని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాల్లో ఏర్పాటుచేసింది. ముఖాన్ని స్కాన్ చేయడం తరువాయి.. మీకు ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చట. టెలిఫోన్ నంబర్లను కూడా పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాలని చెబుతున్నారు.
అచ్చం ఒకేలా ఉండే కవల పిల్లలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా కూడా మీ ముఖాన్ని అది ఎంచక్కా గుర్తుపడుతుందట. అయితే మరీ ముఖం మొత్తం మారిపోయేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం మరోసారి బ్యాంకులో గుర్తింపుకార్డులు ఇచ్చి, ముఖాన్ని స్కాన్ చేయించుకోవాలి. ఈ పద్ధతిలో కేవలం 42 సెకన్లలోనే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు.