భారత ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(ఫైల్‌ఫొటో)
బీజింగ్: పొరుగుదేశాలతో తాము ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటామని... అయితే అదే సమయంలో అంగుళం భూమిని కూడా వదులుకోమని చైనా స్పష్టం చేసింది. అంతేగాక అమెరికా మాయలో పడవద్దంటూ భారత్‌కు హితవు పలికింది. తూర్పు లడఖ్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద భారత్- చైనా మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు తన అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో కథనం ప్రచురించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు శనివారం ఇరు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.(పాక్ పోర్టులో చైనా మరో నిర్మాణం.. అందుకేనా?)
భారత్‌తో శత్రుత్వానికి కారణం కనిపించడం లేదు
ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి కథనంలో..‘‘ భారత్‌తో చైనా ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం చైనా జాతీయ ప్రాథమిక విధానం. దశాబ్దాలుగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. సరిహద్దు వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌ను శత్రువుగా చేసుకునేందుకు మాకు ఏ కారణం కనిపించడం లేదు. అయితే తన భూభాగం నుంచి ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఎన్నటికీ వదులుకోదు. వ్యూహాత్మక తప్పిదాలతో చైనా భూభాగంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తే.. చైనా అస్సలు క్షమించదు. ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. సరిహద్దుల్లో చైనా మిలిటరీ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో ఇండియాకు బాగా తెలుసు’’ అని తాజా వివాదంపై తన వైఖరిని స్పష్టం చేసింది.అదే విధంగా.. చైనా- భారత్ పరస్పరం సహకరించుకుంటేనే అంతర్జాతీయ సమాజంలో భారత్ శాంతియుత సంబంధాలు మరింత మెరుగవుతాయని డ్రాగన్ అభిప్రాయపడింది. (చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!)
అమెరికాకు డ్రాగన్ భయపడదు
అంతేగాకుండా ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాలను అమెరికా తన స్వప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోందని విమర్శించింది. ‘‘ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల హిమాలయ ప్రాంతం, భారత ఉపఖండంలో అస్థిరత చోటుచేసుకుంటుంది. ఏ బాహ్య శక్తిని దీనిని మార్చలేదు. ఇరు వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగా.. శాంతియుతంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. దేశాల మధ్య చీలిక తెచ్చి.. తన వైపునకు తిప్పుకునే విషయంలో వాషింగ్టన్ ముందు వరుసలో ఉంటుంది. చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. (ఊచకోత; చైనా క్షమాపణ చెప్పాల్సిందే: తైవాన్)
అంతేతప్ప ఏ దేశ ప్రయోజనాలకు వారు అనుకూలంగా ఉండరు. చైనా- ఇండియా వివాదాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ అమెరికా ఇండియాకు మద్దతుగా నిలుస్తోంది. కొత్త వివాదాలు తలెత్తేలా రాద్దాంతం చేస్తోంది. అమెరికా చేతిలో ఇండియా ఫూల్ కావొద్దు. ఎందుకంటే చైనా భయంకర పరిస్థితులు సృష్టించదు. అంతేకాదు అమెరికా ఒత్తిళ్లకు లొంగదు. భయపడదు. చైనాను ఇబ్బందుల్లో పడేసే అమెరికాను ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు మేమెలా అనుమతిస్తాం’’అంటూ మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసింది. (ట్రంప్ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా)
Comments
Please login to add a commentAdd a comment