బీజింగ్ : చైనా మీడియా మరోసారి భారత్ పై తన అక్కసును వెల్లగక్కింది. భారత డ్రోన్‌ను కూల్చేశామని ఈ మధ్యే చైనా సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ శనివారం తన ఎడిటోరియల్‌లో ఓ సుదీర్ఘ కథనాన్నే ప్రచురించింది. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో భారత్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది.
‘‘ఇండియా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అన్న కథనంతో రాసిన ఆ సంపాదకీయంలో ఇండియా చర్యలను తప్పుబట్టింది. ‘‘భారత, చైనా సైన్యం మోహరింపుల నడుమ ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో సరిగ్గా అదే ప్రాంతంలో డ్రోన్ సంచారం చేసింది. అది సమస్యాత్మక ప్రాంతం అని తెలిసి కూడా కవ్వింపు చర్యలు చేపట్టడం దారుణం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని చైనా భావిస్తోంది. కానీ, భారత్ సరిగ్గా వ్యవహరించటం లేదు. సాంకేతిక సమస్య అన్న కారణం చెబుతున్నప్పటికీ.. సరిగ్గా అదే స్థలంలో జరగటం సహేతుకంగా లేదు.
ఒకవేళ చైనా నుంచి ఇలాంటి ఘటనే ఎదురయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో మమల్ని దోషులుగా నిలబెట్టేందుకు భారత్ తీవ్రంగా యత్నించేది. కానీ, చైనా భారత్ నుంచి స్నేహాన్ని మాత్రమే కోరుకుంటోంది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత నివేదికతో భారత్ వైఖరిని ఎండగడతాం’’ అని ఆ కథనంలో పేర్కొంది.
ఇక భారత సైన్యం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది తెలిసిందే. ఇజ్రాయెల్ రూపొందించిన హోరోన్ అనే ఈ డ్రోన్ భారత్-చైనా సరిహద్దులోని కొండ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణ కోసం గత కొంత కాలంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తటంతో అది సరిహద్దును దాటిందని భారత ఆర్మీ చెబుతోంది. అయినా చైనా మాత్రం ఆ వివరణపై సంతృప్తి వ్యక్తం చేయటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment