
చైనాలో ఇక వాళ్లంతా ఇంగ్లిషే మాట్లాడాలి
చైనాలో ఇంగ్లిషు వాడకం చాలా తక్కువ. ప్రత్యేకంగా అక్కడివాళ్లకు ఇంగ్లిషు నేర్పించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటిది.. 2017 నుంచి ఆ దేశంలో పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కేవలం ఇంగ్లిషులోనే మాట్లాడుకోవాలట. ఈ మేరకు చైనా పౌర విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విదేశీ పైలట్లకు ఇంగ్లిషులో చెబుతుండగా, చైనా పైలట్లకు మాత్రం మాండరిన్ భాషలో చెబుతున్నారు.
ఇక మీదట చైనాలో విమానయాన కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిష్‌లోనే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆగ్నేయాసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు పైలట్లు ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. అయితే చైనా పైలట్లు ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇప్పుడు కొంత కష్టమే అవుతుంది. చాలామందికి కేవలం ఆరు నెలల శిక్షణ మాత్రమే ఇచ్చారు. దాంతో అంత త్వరగా ఇంగ్లిష్ ఎలా నేర్చుకోవాలో.. ఎలా మాట్లాడాలో తెలియక తల పట్టుకుంటున్నారు.