భారత ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(ఫైల్‌ఫొటో)
బీజింగ్: తూర్పు లడఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. సరిహద్దుల్లో తలెత్తిన విభేదాలు.. వివాదంగా మారేందుకు భారత్- చైనా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోవని వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో అనేకమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారని.. తాజాగా మరోసారి ఇదే పునరావృతమైందని పేర్కొంది. (సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!)
ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్ సోమవారం మాట్లాడుతూ.. ‘‘ జూన్ 6 మధ్యాహ్నం చుసుల్- మోల్డో ప్రాంతంలో చైనా, ఇండియా కమాండర్ల మధ్య సమావేశం జరిగింది. ఇరు వర్గాలు తమ వాదన వినిపించాయి. సరిహద్దు పరిస్థితులపై దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగాయి. సరిహద్దు ఉద్రిక్తతలపై శాంతియుత పరిష్కారం కనుగొని.. విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. చర్చలకు ఇరు వర్గాలు సుముఖంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులన్నీ స్థిరంగా, అదుపులోనే ఉన్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు. (చైనాతో శాంతియుత పరిష్కారం)
కాగా భారత్, చైనా ఉన్నతస్థాయి సైనికాధికారుల మధ్య శనివారం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరు కాగా.. చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. అంతకుముందు రోజు భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక భారత్ సైతం తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలు అంగీకారానికి వచ్చినట్లు భారత్ వెల్లడించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment