న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల పర్వం మళ్లీ మొదలైంది. గతంలో మాదిరిగానే డ్రాగన్ కంట్రీ మళ్లీ తన కపట బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇటీవల లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి చొచ్చుకొచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చక్కర్లు కొట్టింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమవడంతో చైనా విమానం వెనుతిరిగింది. కాగా గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో చైనా ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడటం ఇదే మొదటి సారని భారత సైనిక వర్గాలు తెలిపాయి.
తీరు మారని చైనా..
ఇప్పటికే చైనాతో పలుమార్లు భారత్ చర్చలు జరిపినప్పటికీ అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా మరోసారి భారత్‌పై కవ్వింపులకు దిగింది డ్రాగన్ కంట్రీ. వివరాల ప్రకారం.. జూన్ చివరి వారంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా విమానం భారత స్థావరాలకు చాలా దగ్గరగా వచ్చింది. భారత వైమానిక దళం దీన్ని గమనించి వెంటనే అప్రమత్తం కావడంతో చైనా విమానం దూరంగా వెళ్లిపోయింది.
సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఐఏఎఫ్(IAF) రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. చైనీయులు 2020లో చేసిన విధంగానే ఏదైనా దుస్సాహసాన్ని పాల్పడితే వాటిని అరికట్టడానికి తూర్పు లడఖ్ సెక్టార్‌లో భారత్ బలమైన చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment