బీజింగ్ : భారత్, పాకిస్తాన్‌లను అణ్వాయుధ దేశాలుగా తాము ఎన్నడూ గుర్తించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల వ్యాప్తి నివారణపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత పైలట్ అభినందన్‌ను క్షేమంగా అప్పగించారంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశంసించారు. భారత్- పాక్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలే కాబట్టి పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని సూచించారు. ‘ ఒక్కోసారి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటాయి. అయితే అన్ని వేళలా ఇరు దేశాలకు మా సహకారం ఉంటుంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, తద్వారా శాంతి స్థాపనకు కృషి చేయాలని మేము సూచిస్తాం’ అని లూ వ్యాఖ్యానించారు.
కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేఫథ్యంలో భారత్- పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్ అభినందన్ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని విడనాడాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అమెరికా సహా రష్యా, చైనా పాక్‌కు సూచించాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకే అభినందన్‌ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో చైనా కూడా తమకు మద్దతు ప్రకటించకపోవడం పట్ల పాక్ విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పుల్వామా ఉగ్రదాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కానీ ఈ విషయాన్ని చాలా రోజులుగా వ్యతిరేకిస్తున్న చైనా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తన వైఖరిని స్పష్టం చేయలేదు. అదేవిధంగా భారత్‌ను అణ్వాయుధ దేశంగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment