‘అమెరికా అంటేనే రేప్‌లు, హత్యలు’
బీజింగ్: చైనాలో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ అమెరికా నాయకత్వంలో 11 దేశాలు చేసిన ఆరోపణలను చైనా నిర్ద్వంద్వంగా ఖండించడమే కాకుండా ఎదురుదాడికి దిగింది. ఘాటైన పదజాలంతో అమెరికాపై విరుచుకు పడింది. అమెరికా అంటేనే రేప్‌లకు, హత్యలకు నిలయమని విమర్శించింది. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకునే గన్ సంస్కృతికి పెట్టింది పేరని ఆరోపించింది. ఇది దేశంలో జరగుగుతున్న ఘోర కృత్యాలైతే సరిహద్దులు దాటి ఇతర దేశాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేస్తూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటోందని చైనా దౌత్యవేత్త ఫూ కాంగ్ గురువారం నాడు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో విమర్శించారు.
అమెరికా రాక్షసత్వానికి గ్వాంటెనామో లాంటి జైళ్లే ఉదాహరణని, ఇలాంటి చీకటి జైళ్లు అమెరికాకు ఎన్నో ఉన్నాయని ఫూ కాంగ్ ఆరోపించారు. ఆస్ట్రేలియా, జపాన్, మరో తొమ్మిది ఉత్తర యూరప్ దేశాల మద్దతుతో చైనా మానవ హక్కుల అణచివేతపై రూపొందించిన పత్రాన్ని అమెరికా రాయబారి కీథ్ హార్పర్ మండలిలో చదవి వినిపించారు. దీనిపైనే చైనా దౌత్యవేత్త మండిపడ్డారు. మానవ హక్కుల కార్యకర్తలు, వారికి చెందిన న్యాయవాదులు, న్యాయనిపుణులపై గత జూలై నెల నుంచి చైనా ప్రభుత్వం అణచివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు 250 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు చైనాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.