
అత్యాధునిక యుద్ధవిమానాన్ని పరీక్షించిన చైనా
రహస్యంగా దాడులు చేసే అత్యాధునిక యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించింది.
బీజింగ్: రహస్యంగా దాడులు చేసే అత్యాధునిక యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించింది. పాశ్చాత్య నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా చైనా.. ఈ విమానాన్ని అమెరికా అందిస్తున్న ధరలో సగానికే ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే దీని కొనుగోలుకు భారత్, పాకిస్తాన్ ఆసక్తి చూపించాయి. చైనా ఐదో తరం యుద్ధవిమానమైన ఎఫ్‌సీ–31 గిర్‌ఫాల్కన్ యుద్ధవిమానానికి మెరుగులద్ది గతవారం చైనాలోని షెన్‌యాంగ్‌లో పరీక్షించారు. ఇంతకుముందు దీని పేరు జే–31.
దీనికి రెండు ఇంజన్లుండేవి. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాలోని భాగమైన షెన్‌యాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ వద్ద ఇంకా మెరుగులు దిద్దుకుంటూనే ఉంది. భారత్‌లో ఇటువంటి యుద్ధవిమానాలు ఇంతవరకూ లేవు. 2015 నవంబర్‌లో 14వ దుబాయ్ ఎయిర్‌షోలో దీనికి సంబంధించిన పెద్ద మోడల్‌ను ప్రదర్శించారు. ఆ షోలో దాని టేకాఫ్ బరువు 28 మెట్రిక్ టన్నులనీ, ధ్వని వేగం కంటే 1.8 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు. ఇది ఎనిమిది టన్నుల బరువైన వాహనాలను మోయగలదనీ, రెక్కల కిందున్న ఖాళీలో మరో ఆరు క్షిపణులను తీసుకెళ్లగలదని వివరించారు.