అమెరికా, రష్యాకు ధీటుగా చైనా సవారీ!
షాంఘై: ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. సాధరణంగా ప్రత్యేక లాంచ్ ప్యాడ్‌ల ద్వారా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్షల్లో ప్రవేశ పెట్టడానికి భిన్నంగా ప్రయోగాలు చేయనుంది. ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనున్నట్లు చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపండంతోపాటు, వాణిజ్యపరమైన, శాస్త్రపరమైన లక్ష్యాలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ఈ దిశగా ముందుకు వెళుతున్నట్లు బీజింగ్ అధికారులు చెప్పినట్లుగా పేర్కొంది.
లాంచ్ వెహికల్ టెక్నాలజీని అందించే ది చైనా అకాడమీ ప్రస్తుతం 100 కేజీల పేలోడ్స్‌ను మోసుకెళ్లగల సాంద్ర ఇంధన రాకెట్ల పరిజ్ఞానాన్ని రూపొందించిందని రాకెట్ డెవలప్‌మెంట్ వ్యవహారాలు చుసుకునే సంస్థ డైరెక్టర్ లి టోంగ్యూ చెప్పారు. చైనా అంతరిక్ష ప్రోగ్రాంను మరింత ముందుకు తీసుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెబుతున్నారని, ఈ కార్యక్రమానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
అమెరికా, రష్యాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో చైనా కొంత నిడివి కలిగి ఉన్నందున వాటికి సమానంగా అంతరిక్షరంగంలో కూడా దూసుకెళ్లేలా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వై-20 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మోసుకెళ్లగలిగే రాకెట్‌లను సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారానే రాకెట్ల ప్రయోగం చేసి ఉపగ్రహాలను పంపించనున్నామని వెల్లడించారు. మరోపక్క, చైనా మొట్టమొదటి కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణం ఏప్రిల్‌లో మొదలుకానుంది. 2022నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని చైనా ఏర్పాటుచేయాలనుకుంటున్న విషయం తెలిసిందే.