బీజింగ్: ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది. డాంగ్‌ఫెంగ్ –41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్–41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
‘స్పైక్ క్షిపణుల’ ఉపసంహరణ
ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment